
మహారాష్ట్ర: తన మాజీ ప్రియురాలిని హత్య చేసి, ఆ హత్యను ఆమె భర్తపై నెట్టాలని ప్రయత్నించి చివరకి పోలీసులకి చిక్కాడో వ్యక్తి. దీపాలి రమేష్ అనే మహిళ అవినాష్ వంజారేను పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది. వీరు జల్నాలో నివసిస్తున్నారు. అయితే డిసెంబర్ 21న రైల్వే ట్రాక్ సమీపంలో 20 ఏళ్ల మహిళ మృతదేహంతో పాటు సూసైడ్ నోట్, సెల్‌ఫోన్, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె సెల్ ఫోన్ ఆధారంగా చనిపోయింది దీపాలి అని పోలీసులు గుర్తించారు. ఆమె తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడింది.
తన భర్త చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని దీపాలి ఫోన్ నుంచి ఆమె తండ్రికి మెసెజ్ వచ్చింది. ఆ మెసెజ్ చూసిన పోలీసులు దీపాలి భర్త అవినాష్‌ను అరెస్టు చేశారు. కానీ, దీపాలి మృతదేహానికి పోస్టుమార్టం చేస్తే మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, తలపై బలంగా కొట్టడం వల్లే ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. దాంతో పోలీసులు, దీపాలి ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తే సచిన్ విషయం తెలిసింది.
దీపాలికి, జల్నాలోని ఎంహెచ్‌ఎడి కాలనీలో నివసిస్తున్న సచిన్ గైక్వాడ్‌తో పెళ్లికి ముందే సంబంధముంది. దీపాలి చనిపోయిన రోజు, ఆమెను సచిన్ బైకుపై తీసుకెళ్లడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. దాంతో సచిన్ గైక్వాడ్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారిస్తే మొత్తం కథ చెప్పాడు. దీపాలిని బైక్‌పై రైల్వే ట్రాక్ సమీపంలోకి తీసుకెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య ఓ విషయంలో గొడవ జరిగిందని, ఆ కోపంలో ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆ హత్య తనపైకి రాకుండా ఉండేందుకు.. దీపాలి ఫోన్ నుంచి ఆమె పెట్టినట్లే మెసెజ్ పెట్టానని సచిన్ ఒప్పుకున్నాడు. సచిన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
For More News..