- సెయింట్ జెయిమ్స్ ప్యాలెస్‌లో కార్యక్రమం
- తొలిసారిగా టీవీలో టెలికాస్ట్
- క్వీన్ జీవితాన్ని అనుసరించడానికి కృషి చేస్త: చార్లెస్ 3 వెల్లడి
లండన్: ‘‘నా గొప్ప వారసత్వం, విధులు, సార్వభౌమాధికారం, బాధ్యతల గురించి నాకు బాగా తెలుసు. నా తల్లి దివంగత క్వీన్ ఎలిజబెత్ 2 స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని అనుసరించడానికి కృషి చేస్తా” అని బ్రిటన్ కింగ్ చార్లెస్ 3 అన్నారు. లండన్‌లోని సెయింట్ జెయిమ్స్ ప్యాలెస్‌లో అక్సెషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన చారిత్రక కార్యక్రమంలో బ్రిటన్ కొత్త రాజుగా చార్లెస్ బాధ్యతలు చేపట్టారు. 73 ఏండ్ల వయసులో ఈ పదవిని అలంకరించారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని తొలిసారిగా టీవీలో టెలికాస్ట్ చేశారు. కౌన్సిల్ క్లర్క్ ప్రకటన చేస్తున్న సమయంలో.. ‘గాడ్ సేవ్ ది కింగ్’ అంటూ సభికులు నినాదాలు చేశారు. తర్వాత రాజు హోదాలో తొలిసారి చార్లెస్ ప్రసంగించారు. తన తల్లి, క్వీన్ ఎలిజబెత్ మరణించారని ప్రకటించడం.. అత్యంత బాధాకరమైన డ్యూటీ అని అన్నారు. క్వీన్ ఎలిజబెత్ II జీవితకాల ప్రేమ, నిస్వార్థ సేవకు ఉదాహరణగా నిలిచారని అన్నారు. ఆమె పాలన అసమానమన్నారు. తన భార్య కెమిల్లా తనకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చార్లెస్ భార్య, క్వీన్ కన్సోర్ట్ కామిలా, ఆయన కొడుకు ప్రిన్స్ విలియం తదితరులు పాల్గొన్నారు. అధికారిక ప్రకటన పత్రాలపై వారు కూడా సంతకాలు చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో రాజరిక ఖర్చులను కవర్ చేసే సావరిన్ గ్రాంట్‌కు బదులుగా అన్ని ఆదాయాలు, క్రౌన్ ఎస్టేట్‌ను దేశానికి అప్పగించే సంప్రదాయాన్ని చార్లెస్ కొనసాగించారు.
ఈ నెల 19న అంత్యక్రియలు
క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలను ఈ నెల 19న నిర్వహించనున్నట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. రాణి పార్థీవ దేహాన్ని ప్రజలు సందర్శించుకునేందుకు వీలుగా 4 రోజుల పాటు వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
కింగ్‌తో కొత్త ప్రధాని భేటీ
బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్‌తో చార్లెస్ భేటీ అయ్యారు. తన తల్లి మరణం భయపెడుతున్నదని, కానీ అంతా సవ్యంగా జరిగేలా చేసేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో వీరిద్దరూ సమావేశమయ్యారు. క్వీన్ చనిపోవడానికి రెండు రోజుల ముందు.. స్కాట్లాండ్‌లోని ప్యాలెస్‌లో లిజ్ ట్రస్‌ను కొత్త ప్రధానిగా నియమించారు.
