
విజయ్ దేవరకొండ కింగ్‍డమ్ సినిమాకు కొత్త టెన్షన్ పట్టుకుంది. రిలీజ్కు దగ్గర పడుతున్న ఈ సినిమాపై కొత్త టాక్ మొదలైంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ విడుదల ఆలస్యం కానుందని సమాచారం.
ఇప్పటికే, కింగ్‍డమ్ మూవీని మే 30న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఇదే డేట్కి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కింగ్‍డమ్ చిత్రబృందం మరియు విజయ్ ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు. అసలేం జరిగిందంటే...
పవన్ కల్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ పీరియాడికల్ యాక్షన్ మూవీగా హరిహర వీరమల్లు తెరకెక్కింది. ఈ మూవీ గతేడాది నుంచి పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఓ సారి డైరెక్టర్ మారడంటూ, మరోసారి షూటింగ్ బ్యాలన్స్ ఉందంటూ మరికొన్ని సార్లు VFXకోసం అంటూ.. వంటి కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే మే9 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దాంతో కింగ్‍డమ్ సినిమాను మే30న తీసుకొస్తున్నట్లు నిర్మాత నాగవంశీ కన్ఫామ్ చేశారు. అయితే, ఇప్పుడు హరిహర వీరమల్లు షూటింగ్ ఆలస్యం కావడం చేత మే 30న రిలీజ్ కానుందని కొత్త టాక్. దాంతో కింగ్‍డమ్ మేకర్స్ ఎటూతేల్చుకోలేని అయోమయ స్థితిలో పడాల్సి వచ్చింది. ప్రమోషన్లు చేసేందుకు కూడా క్లారిటీ లేక మూవీ టీమ్ డైలమాలో పడిందని టాక్.
అయితే, ఈ హరిహర వీరమల్లు సినిమాను మే30న థియేటర్లలో రిలీజ్ చేసేలా మూవీ టీమ్‍కి ఒత్తిడి మొదలైందట. హరిహర వీరమల్లు ఓటీటీ ప్లాట్‍ఫామ్..సినిమా రిలీజ్ విషయంలో ఒత్తిడి చేస్తోందనే టాక్ కూడా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ, జూన్ సెకండ్ వీక్లో రిలీజ్ చేసేలా వీరమల్లు నిర్మాతలు భావిస్తున్నారట. ఇలా వీరమల్లు విషయంలో ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోవడంతో కింగ్‍డమ్ మేకర్స్ అయోమయంలో ఉన్నారట. దాంతో ఇపుడే కింగ్‍డమ్ ప్రమోషన్స్ చేయాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డారట. మరి చివరకి ఏం జరగనుందో చూడాలి.
ఇకపోతే.. హరిహర వీరమల్లు సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల చేయనున్నారు. హరి హర వీరమల్లు ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు సొంతం చేసుకుంది.
కింగ్‍డమ్ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఫుల్ స్పై యాక్షన్ ప్యాక్డ్ మూవీగా రానున్న ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.