రేవంత్‌‌కు కిసాన్ కాంగ్రెస్ కృతజ్ఞతలు : కోదండరెడ్డి

రేవంత్‌‌కు కిసాన్ కాంగ్రెస్ కృతజ్ఞతలు  :  కోదండరెడ్డి

హైదరాబాద్, వెలుగు: రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌‌లో తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ కిసాన్ సెల్‌‌ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఆ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి శనివారం గాంధీ భవన్‌‌లో మీడియాతో మాట్లాడారు. ఇందిరా గాంధీ హయాం నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కేబినెట్‌‌లో తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందన్నారు. కాగా, కేబినెట్‌‌లో రుణ మాఫీపై నిర్ణయం తీసుకోవడంతో కిసాన్ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్‌‌లో సంబురాలు చేసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ సంబురాల్లో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌‌ రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.