రాష్ట్రం కోరితే.. 48 గంటల్లో సీబీఐ ఎంక్వైరీ

రాష్ట్రం కోరితే.. 48 గంటల్లో సీబీఐ ఎంక్వైరీ

  కాళేశ్వరంపై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి
 రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ది నిరూపించుకోవాలె
 పరిశీలనకు, రివ్యూలు సరే యాక్షన్ లోకి దిగండి
 బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అందుకే కాలయాపన
 ఈ రెండు పార్టీలకు మజ్లిస్ రాయబారం నడిపిందా?
 జ్యుడీషియల్ ఎంక్వైరీ పేరుతో కేసీఆర్ కు మేలు
 తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వమని బీఆర్ఎస్ తో ఒప్పందం చేసుకున్నారా?
 బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

 

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కోరితే కాళేశ్వరం అవినీతిపై 48 గంటల్లో కేంద్రం సీబీఐతో విచారణ చేయిస్తుందని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేయించే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉందా..? లేదా..? అని ప్రశ్నించారు.

 ఎన్నికలకు మందు సీబీఐతో విచారణ చేయిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ కు , ఆ ఫ్యామిలీకి మేలు చేసేలా జ్యుడీషియల్ ఎంక్వైరీ అంటున్నారన్నారు. దీనిపై ప్రజలకు అనేక అనుమానాలున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, ఈ రెండు  పార్టీలకు మధ్య మజ్లిస్ రాయబారం నడిపిందనే డౌట్స్ ఉన్నాయని చెప్పారు.  

బీఆర్ఎస్  ప్రభుత్వ హయాంలో జరిగిన అతిపెద్ద స్కాంపై రివ్యూలు, పరిశీలనలు చేస్తున్న సీఎం, మంత్రులు సీబీఐ ఎంక్వైరీ విషయాన్ని పట్టించుకోవడం లేదున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెజార్టీ లేనందునే బీఆర్ఎస్ తో ఏదైనా రహస్య ఒప్పందం కుదుర్చుకున్నదా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. 

ఈ రెండు పార్టీలు ఒక్కటి కాదని నిరూపించుకునేందుకు సీబీఐ విచారణ కోసం కేంద్రానికి ముఖ్యమంత్రి లేఖ రాయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని సవాలు చేసిన వాళ్లు ఇప్పుడెందుకు సీబీఐ విచారణ కోరడం లేదన్నారు. ఈ రెండు పార్టీల నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 

కేసీఆర్ మీద కసే మిమ్మల్ని గెలిపించింది

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదని, కేసీఆర్ అవినీతి మీద, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని కిషన్ రెడ్డి అన్నారు. గ్యారెంటీల పేరుతో అధికారంలోకి రావడం కాదన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. ప్రధానంగా ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై, కుంభకోణాలపై విచారణ జరగాలని కోరుకున్నారని చెప్పారు. సీఎం రేవంత్  రెడ్డి తక్షణం స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.