విద్యుత్ అగ్రిమెంట్కు రాష్ట్రమే ముందుకొస్తలే : కిషన్ రెడ్డి

 విద్యుత్ అగ్రిమెంట్కు రాష్ట్రమే ముందుకొస్తలే : కిషన్ రెడ్డి
  • సీఎంను ఎన్టీపీసీ చైర్మన్ కలిసినా స్పందన లేదు: కిషన్ రెడ్డి
  • కేంద్రం ఇస్తున్న పంచాయతీ నిధులను దారి మళ్లిస్తున్నరు
  • భూములు అమ్మి జీతాలివ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఫైర్

యాదాద్రి, వెలుగు: ఎన్టీపీసీ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. విద్యుత్‌ కొనుగోలు విషయంపై ఎన్టీపీసీ చైర్మన్‌.. సీఎం రేవంత్​ను కలిసినా పవర్‌ పర్చేస్‌ అగ్రిమెంట్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపకుండా.. ప్రైవేట్‌ సంస్థల నుంచి కొనేందుకు మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే దేశంలో పవర్‌ కట్‌ అనేదే లేదన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు.

పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి. రీజినల్‌ రింగ్‌ రోడ్డు 50 శాతం పనులకు త్వరలోనే కేంద్రం ఆమోదం తెలుపనున్నది. రూ.1,360 కోట్లతో బీబీనగర్‌లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్‌ మరో 3 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తది.

వ్యవసాయం అభివృద్ధి, రైతుల అభ్యున్నతిపై మోదీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. మద్దతు ధరలను ఎప్పటికప్పుడు పెంచుతున్నది. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందుకోసం రూ.లక్షల కోట్లు వెచ్చిస్తున్నది. రూ.600 కోట్లతో వరంగల్‌లో నిర్మిస్తున్న కోచ్‌ ఫ్యాక్టరీ వచ్చే ఏడాది పూర్తవుతుంది. కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్‌ను సంక్రాంతి తర్వాత ప్రారంభిస్తాం’’అని కిషన్ రెడ్డి తెలిపారు. 

ఏం సాధించారని విజయోత్సవాలు?

వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీకి వచ్చే ఏడాది శంకుస్థాపన చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. ‘‘ఆడపిల్లకు తులం బంగారం.. ప్రతినెల రూ.2,500 ఇవ్వనందుకు.. అప్పులు చేసినందుకు.. 6 గ్యారంటీలు అమలు చేయనందుకు.. అవినీతిని పెంచి పోషిస్తున్నందుకు విజయోత్సవాలు చేస్తున్నారా? పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తున్నారు’’అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌గౌడ్‌, వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

అలా వెళ్లి.. ఇలా రావడానికే ఫ్రీ బస్సు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను విస్మరించిందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రీ బస్‌ స్కీమ్‌.. మహిళలు అలా వెళ్లి.. ఇలా రావడానికే ఉపయోగపడుతున్నది. బంగారు తెలంగాణ పేరుతో బీఆర్‌ఎస్‌, ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్‌.. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేస్తున్నాయి. భూములు అమ్ముకోవడంపైనే దృష్టిపెట్టారు. వాటి ద్వారా వచ్చిన డబ్బులతోనే జీతాలు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇస్తున్నారు’’అని కిషన్ రెడ్డి అన్నారు.