
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్.. డాడీ, డాటర్, సన్, సన్ ఇన్ లా పార్టీ అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీకి భవిష్యత్ లేదన్నారు. ‘‘డాడీ-, డాటర్ లేఖ.. ఓ డ్రామా. అందులో కంటెంట్ లేదు. ఆ లేఖకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. అది డాడీ, డాటర్ మధ్య అంతర్గత లేఖ. బీఆర్‌ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ లాంటిది. అలాంటి పార్టీలో ఇలాంటి సంఘటనలు జరగడం సహజం” అని అన్నారు. కేసీఆర్ బీజేపీని రెండే నిమిషాలు తిట్టారంటూ లేఖలో కవిత రాశారని, అయితే ఓడిపోయిన పార్టీ గురించి తాము పట్టించుకోబోమన్నారు. కుటుంబ పార్టీలు దేశానికి ప్రమాదకరమని, అవి ప్రజల కొంప ముంచుతాయని వ్యాఖ్యానించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ గతంలో ఎప్పుడూ ప్రజాసంఘాలను, రైతు సంఘాలను, విద్యార్థి సంఘాలను, యువజన సంఘాలను, మహిళా సంఘాలను కలవలేదన్నారు. 2019లో తాను కేంద్రమంత్రి అయిన తర్వాత నాటి సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలవాలని అనుకున్నానని, కానీ ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని చెప్పారు.
మేడిగడ్డ కేసును సీబీఐకి అప్పగించండి..
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు చట్టబద్ధంగా జరుగుతున్నదని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పరిశ్రమల నుంచి ‘ట్రిపుల్ ఆర్ ట్యాక్స్’ పేరుతో భారీగా వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీటలు వారుతున్నాయని అన్నారు. మేడిగడ్డ కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘ వర్షాలతో వారం రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు కల్లాల్లోనే ఉండిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను స్పీడప్ చేయాలి. 53 లక్షల టన్నుల ధాన్యం సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత సేకరించినా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది” అని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కేంద్ర సంస్థలను తెలంగాణలో ఏర్పాటు చేశామని, వాటి వివరాలను త్వరలోనే ప్రజల ముందుంచుతామని తెలిపారు. జీన్ ఎడిటింగ్ గ్రీన్ హౌజ్‌లు, స్పీడ్ బ్రీడింగ్ ల్యాబ్స్, ఫినోమిక్స్ ల్యాబ్స్ వంటి ఆధునిక పరిశోధనా వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.