ఒక్కనాడైనా ప్రజల్లోకి వచ్చినవా? .. కేసీఆర్​కు కిషన్ రెడ్డి లేఖ

ఒక్కనాడైనా ప్రజల్లోకి వచ్చినవా? .. కేసీఆర్​కు కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 9 ఏండ్ల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ నియంతలా వ్యవహరిస్తున్న  బీఆర్ఎస్​కు, సీఎం కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని కేంద్ర మంత్రి , బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఆయన ఎవరి మాటా వినడు అన్నట్లుగా కేసీఆర్ తయారయ్యారని, ఉద్యమ కాలంలో అన్ని పార్టీల గడప తొక్కి, అధికారం వచ్చాక ఆ పార్టీల ఉనికే లేకుండా చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. శుక్రవారం కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ రాశారు.

ఉద్యమంలో ఉన్న రాజకీయ జేఏసీలోని ప్రజాసంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు, విద్యావంతులు, మేధావులను దూరం పెట్టింది మీరు కాదా అని అన్నారు. అంతా నేనే అన్నట్లుగా వ్యవహారించారని ఆరోపించారు. ధర్నాచౌక్‌ను ఎత్తివేశారని మండిపడ్డారు. గొంతెత్తిన వారిని తొక్కిపెడుతున్నారని ఆరోపించారు. మీ పాలనలో ఎన్నో స్కామ్ లు, దౌర్జన్యాలు, దోపిడీలు జరిగాయని, ఇదేనా బంగారు తెలంగాణ అని లేఖలో కిషన్ రెడ్డి ప్రశ్నించారు.