బీఆర్ఎస్ హయాంలో రౌడీయిజం పెరిగింది : కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ హయాంలో రౌడీయిజం పెరిగింది : కిషన్ రెడ్డి
  • జూబ్లీహిల్స్​లో ల్యాండ్ కబ్జాలు చేశారు: కిషన్ రెడ్డి
  • ప్రజలు, రిపోర్టర్లను బీఆర్ఎస్ నేతలు వేధించారు
  • కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమైనయ్ అని ఫైర్

హైదరాబాద్, వెలుగు: నాటి బీఆర్‌‌ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కబ్జాలు, అక్రమాలు, రౌడీయిజం, నేరాలు పెరిగిపోయాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు.. ప్రజలను, నాయకులను, రిపోర్టర్లను వేధించారని ఆరోపించారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన హైదరాబాద్ లో వీక్షించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మహిళలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశాయని, కేసీఆర్ కూడా గతంలో ఇలాగే మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు.

 హైదరాబాద్​లోని చాలా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, సనత్ నగర్ లా జూబ్లీహిల్స్ ను ఎందుకు కేసీఆర్, రేవంత్ అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పాకే వారిని ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకుని ఓట్లు అడగడం కాదని, దమ్ముంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం గల్లీలో తిరగాలని సవాల్ చేశారు. ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలైన 4 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మజ్లిస్ కబంధ హస్తాల నుంచి హైదరాబాద్‌‌ను రక్షించుకోవాలని, ఈ మూడు పార్టీలు ఒక్కటేనని ఆయన విమర్శలు చేశారు. ఓటుతో బీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్, మజ్లిస్ కు బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి కోరారు.