బడంగ్ పేట్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బడంగ్ పేట్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి అన్నారు. ఇవాళ బడంగ్ పేట కార్పొరేషన్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాలకు కావ్యారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె తోపాటు మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు అందెల శ్రీరాములు యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కావ్యారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను మమైకం చేసిన ఉత్సవం బతుకమ్మ పండుగ అని అభివర్ణించారు. తెలంగాణ సాంప్రదాయాలు విదేశాల్లో కూడా కొనసాగుతున్నాయని ఆమె అన్నారు. అనంతరం శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మహిళలను ఐక్యం చేసిన ఉత్సవం బతుకమ్మ అన్నారు. ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి మహిళాశక్తిని చాటి రజాకార్లను తరమికొట్టారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలను పార్టీలకు అతీతంగా నిర్వహించుకోవటం సంతోషమని శ్రీరాములు యాదవ్ అన్నారు.
 
భవిష్యత్తులో బతుకమ్మ ఉత్సవాలను.. రాబోయే తరాలకు తెలిసేలా మహేశ్వరం నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహిస్తామని శ్రీరాములు చెప్పారు. ఈ బతుకమ్మ వేడుకల్లో మహేశ్వరం నియోజకవర్గంలోని బీజేపీ ప్రజాప్రతినిధులు, స్థానిక కార్పొరేటర్లు నాయకులు, మహిళా మోర్చా నాయకురాళ్లతో సహా స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళల కోలాటాలు, యువత ఆట-పాటలు, డ్యాన్లులు ఆకట్టుకున్నాయి.