పేరు ముఖ్యం కాదు.. పేదోడికి పనే ముఖ్యం : కిషన్ రెడ్డి

పేరు ముఖ్యం కాదు.. పేదోడికి పనే ముఖ్యం : కిషన్ రెడ్డి
  •     ఉపాధి హామీలో మార్పులు ప్రజల మంచికే: కిషన్ రెడ్డి 
  •     రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కామెంట్ 

హైదరాబాద్, వెలుగు:‘‘పథకం పేరు మారిందని రాద్దాంతం ఎందుకు? గతంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పేరును మార్చలేదా?  బేగంపేట ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెడితే తీసేయలేదా? పేర్లు కాదు.. పేదలకు పని దొరుకుతుందా లేదా అన్నదే అసలు పాయింట్" అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. "వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌‌‌‌గార్ ఆజీవికా మిషన్(జీ- రామ్‌‌‌‌- జీ)" పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. 

సోమవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. "ఉపాధి హామీ పథకంలో జవాబుదారీతనం ఉండేలా కొత్త చట్టం తెచ్చాం. దీనిప్రకారం.. ప్రతి కూలీకి కచ్చితంగా పని కల్పించాల్సిందే. ఒకవేళ 15 రోజుల్లో పని చూపించకపోతే నిరుద్యోగ భృతి చెల్లించేలా నిబంధన పెట్టాం. పని చేశాక వేతనాలు ఆలస్యమైతే రోజుకు 5 శాతం చొప్పున పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో  రాజకీయ నాయకులు, దళారులు, మధ్యవర్తులు ఉపాధి హామీ నకిలీ జాబ్ కార్డులతో కోట్లు దండుకున్నారు. ఇప్పుడలా జరగదు. ఈ పథకం అమలులో ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. 

ఏ సీజన్ లో వ్యవసాయ పనులుంటాయి? ఏ టైంలో ఉపాధి పనులు కల్పించాలి? అనేది డిసైడ్ చేసే పవర్ రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చాం" అని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. మరోసారి ప్రధానిగా మోదీనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని తాము కూడా కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. మేడారం జాతరకూ కేంద్రం నుంచి నిధులు ఇస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, బీజేపీ నేతలు బీబీపాటిల్, ఎన్.గౌతమ్ రావు తదితరులు పాల్గొన్నారు.