Kishkindhapuri Review: హారర్ థ్రిల్లర్ తో భయపెట్టిన 'కిష్కింధపురి'.. ప్రీమియర్స్ టాక్ ఇదే!

 Kishkindhapuri Review: హారర్ థ్రిల్లర్ తో భయపెట్టిన 'కిష్కింధపురి'..  ప్రీమియర్స్ టాక్ ఇదే!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. ఈ సినిమా  సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే ట్రైలర్‌తోనే ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచింది. ఈ ఉత్కంఠభరితమైన చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోను రెండు రోజుల ముందే హైదరాబాద్‌లోని AAA మల్టీప్లెక్స్‌లో వేశారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సినిమా మొత్తం ఉత్కంఠతో సాగుతుందని, చివరి వరకు భయపెడుతూనే థ్రిల్ చేసిందని పోస్ట్ చేస్తున్నారు.

భయంభయంగా.. థ్రిల్లింగ్‌గా!

మొత్తం 2 గంటల 5 నిమిషాల నిడివితో రూపొందించిన ఈ చిత్రం, మొదటి 10 నిమిషాలు కథలోకి వెళ్లడానికి కొంత సమయం తీసుకున్నా, ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులను తమ సీట్ల అంచున కూర్చోబెట్టించాడంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర కిష్కింధపురిలోని సువర్ణ మాయలోకి అడుగుపెట్టాక అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుండి దర్శకుడు కథను పరుగులు పెట్టించడమే కాకుండా, ఊహించని మలుపులతో భయపెట్టేసాడని ఎక్స్ లో  నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.

హారర్ ఎలిమెంట్స్‌ తో .. 

సినిమా ఫస్ట్ హాఫ్ ఎలాంటి అనవసరమైన హంగులు లేకుండా..  కథలోని కీలక అంశాలను చాలా చక్కగా చూపించిందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని చెప్పారు. అలాగే, సెకండ్ హాఫ్ కూడా అంతే గ్రిప్పింగ్‌గా, హారర్ ఎలిమెంట్స్‌ని ఏ మాత్రం తగ్గించకుండా అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు.

 

నటీనటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ హారర్ థ్రిల్లర్ జానర్‌లో చాలా మెరుగైన నటనను కనబరిచాడని ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ జానర్ అతనికి బాగా సెట్ అయిందని, అతని నటన చాలా పరిణతి చెందిందని అంటున్నారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ క్లైమాక్స్‌లో చేసిన పర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచిందని అంటున్నారు. ముఖ్యంగా దయ్యంగా మారే సన్నివేశంలో ఆమె నటన అద్భుతమని అంటున్నారు. తమిళ నటుడు శాండ నటన గూస్ బంప్స్ తెప్పిస్తుందని, విలన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుందని చెబుతున్నారు.

సాంకేతిక అంశాలు

ఈ సినిమాకు ప్రధాన బలం సౌండ్ డిజైన్ అని చెప్పవచ్చు. ఎం.ఆర్. రాజా కృష్ణన్ అందించిన సౌండింగ్, హారర్ సన్నివేశాలను మరింత ప్రభావవంతంగా మార్చిందని, సౌండ్‌తోనే భయాన్ని సృష్టించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. విజువల్స్ ,  బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయని చెప్పుకొస్తున్నారు.

మొత్తానికి, 'కిష్కింధపురి' సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా కాలం తర్వాత ఒక మంచి హిట్ సాధించబోతున్నడని చెబుతున్నారు. గతంలో వచ్చిన 'రాక్షసుడు' సినిమాను మించి ఇది ఉందని, దానిని తలదన్నేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రీ క్లైమాక్స్ సెటప్, ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్ వంటివి బాగున్నప్పటికీ, క్లైమాక్స్ కొంచెం రొటీన్‌గా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా, సినిమాను థియేటర్‌లోనే చూసి ఈ ఉత్కంఠభరితమైన అనుభవాన్ని పొందొచ్చు అంటున్నారు ప్రేక్షకులు. పార్ట్ 2 కోసం ఇచ్చిన చివరి నిమిషంలో ఇచ్చిన ట్విస్ట్ కూడా చాలా బాగుందని చెబుతున్నారు. ఈ సినిమాతో బెల్లంకొండ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడా? 'కిష్కింధపురి' బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.