జమ్మూకాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్.. సగం ఊరు కొట్టుకుపోయింది

జమ్మూకాశ్మీర్లో  క్లౌడ్ బరస్ట్.. సగం ఊరు కొట్టుకుపోయింది

జమ్మూకాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం సృష్టించింది. గురువారం (ఆగస్టు 14) కిష్వార్ జిల్లాలోని చోసిటి గ్రామంలో భారీ క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వరదలు సంభవించాయి. ప్రసిద్ద మచైల్ చండీమాతా యాత్రకు వెళ్లే మార్గంలో ఉన్న ఈ గ్రామంలో యాత్రకు వెళ్తున్న లంగర్ (కమ్యూనిటీ కిచెన్ ) కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 12మంది మృతి చెందారు. వరదల్లో అనేక మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశి క్లౌడ్ బరస్ట్ ఘటన మరువకముందే జమ్మూ కాశ్మీర్ లో ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. 

జమ్మూకాశ్మీర్ లోని చోసిటి, పాద్దర్, కిష్వార్ లలో క్లౌడ్ బరస్ట్ తో భారీ విధ్వంసం జరిగింది. మచైల్ మాతా ఆలయం యాత్ర మార్గంలో ఆకస్మిక వరదలు రోడ్లు, ఇళ్ళు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి.

మచైల్ పుణ్యక్షేత్రానికి వెళ్లే మార్గంలో చివరి గ్రామమైన చోసిటీలో  గురువారం క్లౌడ్ బరస్ట్ లో సగం గ్రామం కొట్టుకుపోయింది.. అనేక ఇళ్లు బురద, రాళ్ల కింద భూస్థాపితం అయ్యాయి. స్థానిక అధికారులు, రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

 మచైల్ మాతా యాత్ర మార్గంలోని చిషోటిలో క్లౌడ్ బరస్ట్ తర్వాత దాదాపు 60 మంది గల్లంతయ్యారు. వారిని వెతికేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా అనేక మంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత  పుణ్యక్షేత్రానికి వార్షిక యాత్రను నిలిపివేశారు.