
- ఆయుధాలతో పరస్పరం రెండు కుటుంబాలు దాడి
- నలుగురిపై కేసు నమోదు చేసిన వరంగల్ మట్టెవాడ పోలీసులు
వరంగల్ సిటీ, వెలుగు : ఇన్ స్టాలోని రీల్ రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. ఇరువర్గాలు ఆయుధాలతో దాడికి దిగిన ఘటన వరంగల్ సిటీలో స్థానికంగా కలకలం రేపింది. మట్టెవాడ సీఐ గోపి తెలిపిన ప్రకారం.. కొత్తవాడకు చెందిన ఇంటర్ స్టూడెంట్ సాజిదాన ఇన్స్టా లో రీల్స్చేస్తుంటాడు. వారం కింద ఓ బాలికకు అతడు ముద్దు పెడుతూ వీడియో చేసి అప్ లోడ్ చేశాడు. అదే ప్రాంతానికి చెందిన టెన్త్ స్టూడెంట్ అరాఫత్ ఆ వీడియోను చూశాడు. వెంటనే సాజిదాన తండ్రికి చెప్పాడు.
దీంతో సాజిదాన శుక్రవారం అరాఫత్ ను ఎంజీఎం ఆస్పత్రి సమీపంలో పట్టుకుని కొట్టాడు. ఇది కాస్త రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు ఆయుధాలతో దాడి చేసుకుంటుండగా..సమాచారం అందడంతో పోలీసులకు వెళ్లి చెదరగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేశారు. శనివారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. రెండు కుటుంబాలకు చెందిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ సీఐ తెలిపారు.