సర్పంచ్ ఏకగ్రీవానికి ఎకరం భూమి, కోటి ప్యాకేజీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నఆఫర్

సర్పంచ్  ఏకగ్రీవానికి  ఎకరం భూమి, కోటి ప్యాకేజీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నఆఫర్

 గ్రామాల్లో పంచాయతీ  ఏకగ్రీవానికి ఆఫర్స్​ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే  మొదటి విడత ఎన్నికలకు నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. అయితే  సర్పంచ్​ పదవులపై కన్నేసిన ఆశావాహులు రంగంలోకి దిగుతున్నారు. పోటీ వద్దంటూ ఏకగ్రీవాల కోసం బేరసారాలు మొదలుపెట్టారు. గ్రామంలో గుడి, బడిలాంటి అభివృద్ధి పనులకు పెద్దమొత్తంలో డబ్బులిస్తామని ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఆనుకొని ఉన్న జనరల్​ పంచాయతీల్లో సర్పంచ్​పదవులకు మస్త్​ డిమాండ్​ ఉన్నది.  కొన్ని చోట్ల రూ . కోటి దాకా పెట్టేందుకు ఆశావహులు ముందుకు వస్తున్నారు.

 లేటెస్ట్ గా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం ముటాపురం గ్రామానికి కిష్టారావు అనే  అభ్యర్థి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనను  గ్రామానికి  సర్పంచ్ గా  ఏకగ్రీవం చేస్తే  కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తానని ప్రకటించాడు. అంతేగాకుండా ఊర్లోని వీరన్న సామి గుడికి ఎకరం భూమిని విరాళం ఇస్తానని..అంతేగాకుండా  పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని అన్నాడు.. విద్యార్థులకు సొంతగా స్కాలర్ షిప్ ఇస్తానని చెప్పాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గ్రామస్థులు మాత్రం కిష్టారావు నాన్ లోకల్ అని అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని  చెబుతున్నారు స్థానికులు. 

గత ఎన్నికల్లో 1,935 ఏకగ్రీవాలు

పంచాయతీ రాజ్ శాఖ అధికారిక లెక్కల ప్రకారం 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,935 గ్రామ పంచాయతీ లు ఏకగ్రీవం అయ్యాయి.  ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 162 అయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్, నల్గొండ, వరంగల్ రూరల్ జిల్లాలు ఉన్నాయి.