క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది కేక్. పల్లెలు, పట్టణాలు.. ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడి కనిపిస్తుంటుంది. కేక్‌ల కోసం బేకరీల ముందు ‘క్యూ’లు కడుతుంటారు జనం. పిల్లల నుంచి పెద్దల వరకు ‘నో’ చెప్పని ఐటమ్ ఏదైనా ఉందంటే అది కేక్. వంట బాగా చేయడం రాకపోయినా కూడా ఈజీగా చేయగల ఆరెంజ్, యాపిల్, ప్లమ్ కేక్స్ ఇవి. సో, ఫెస్టివల్‌కి కేక్ ఇంట్లోనే ట్రై చేయండి.
ఆరెంజ్ – ఆల్మండ్
కావాల్సినవి :
కమలా పండ్లు – రెండు
బాదం పొడి – రెండు కప్పులు
బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఆరెంజ్ జెస్ట్(కమలా పండు తొక్క తురుము), బాదం ఎసెన్స్ – ఒక్కో టీస్పూన్ చొప్పున, వెన్న – అర కప్పు, బ్రౌన్ షుగర్ – ఒక కప్పు
కోడిగుడ్లు – ఐదు
ఐసింగ్ షుగర్ – ఒకటిన్నర కప్పు
కమలాపండు జ్యూస్ – పావు కప్పు
తయారీ :
ఒక గిన్నెలో నీళ్లు పోసి, కమలాపండ్లు వేసి మూతపెట్టి ఉడికించి, మిక్సీ పట్టాలి. మరో గిన్నెలో కోడిగుడ్ల సొన, బ్రౌన్ షుగర్, బాదం ఎసెన్స్ వేసి బాగా కలపాలి. తర్వాత అందులో బాదం పొడి, బేకింగ్ సోడా కలిపి జల్లెడ పట్టాలి. మిక్సీ పట్టిన కమలాపండు మిశ్రమం కలపాలి. దాన్ని నెయ్యి పూసిన గిన్నెలో వేసి, ఒవెన్‌లో పెట్టాలి. లేదా ప్రెజర్ కుక్కర్లో స్టాండ్ ఉంచి, దానిపై ఈ మిశ్రమం ఉన్న గిన్నె పెట్టాలి. గిన్నె మీద మూత పెట్టి ఉడికిస్తే కేక్ రెడీ అవుతుంది. మరో గిన్నెలో ఐసింగ్ షుగర్, బాదం ఎసెన్స్, కమలాపండు జ్యూస్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కేక్‌పై పూసి, బాదం తరుగు చల్లాలి.
ప్లమ్
కావాల్సినవి :
బెల్లం పొడి – అర కప్పు, వేడి నీళ్లు – పావు కప్పు
ఫ్రూట్ జ్యూస్ – పావు కప్పు, ఖర్జూర, డ్రై చెర్రీస్, ఆప్రికాట్ తరుగు, కిస్ మిస్, నల్ల ఎండు ద్రాక్ష, లేత కొబ్బరి (సన్నగా తరిగి)– ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున, టూటీ ఫ్రూటీ – నాలుగు టేబుల్ స్పూన్లు
పెరుగు – రెండు టేబుల్ స్పూన్లు, గోరు వెచ్చని పాలు, నూనె – ఒక్కోటి పావు కప్పు చొప్పున, గోధుమ పిండి – ఒకటింబావు కప్పు
బేకింగ్ పౌడర్ – ఒక టీస్పూన్ చొప్పున, బేకింగ్ సోడా – అర టీస్పూన్,శొంఠి, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ పొడి – ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున, కార్న్‌ఫ్లోర్ – రెండు టీస్పూన్లు
బాదం, జీడిపప్పు, పిస్తా, చెర్రీస్ – ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున
తయారీ :
ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి, బెల్లం పొడి, ఫ్రూట్ జ్యూస్, లేత కొబ్బరి ముక్కలు, ఖర్జూర తరుగు, డ్రై చెర్రీస్, ఆప్రికాట్ తరుగు, నల్ల ఎండు ద్రాక్ష, కిస్మిస్, టూటీ ఫ్రూటీ వేసి కలిపి, ఒక గంట నానబెట్టాలి. తర్వాత నూనె వేయాలి. చిన్న గిన్నెలో పాలు, పెరుగు వేసి కలపాలి. గోధుమ పిండి, శొంఠి, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ పొడి అన్నింటినీ ఒకేసారి జల్లెడ పట్టి, మిశ్రమంలో కలపాలి. ఇందులో పాలు, పెరుగు మిశ్రమంతోపాటు బాదం, జీడిపప్పు, పిస్తా, చెర్రీస్ కూడా వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసి, డ్రైఫ్రూట్స్ చల్లాలి. పాన్‌లో స్టాండ్ పెట్టి, మూతపెట్టాలి. పాన్ వేడయ్యాక, స్టాండ్ పై కేక్ మిశ్రమం ఉన్న గిన్నె పెట్టి, మూతపెట్టాలి. గంట సేపు తక్కువ మంట మీద ఉడికిస్తే ప్లమ్ కేక్ రెడీ.
