
- హైదరాబాద్‌పై ఆరు వికెట్ల తేడాతో విక్టరీ
దుబాయ్: ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అదరగొట్టింది. ఆల్‌రౌండ్ షోతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ఆదివారం రాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై గెలిచింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలను మరింత బలోపేతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 115 రన్స్ చేసింది. విలియమ్సన్(26), అబ్దుల్ సమద్(25), ప్రియమ్ గార్గ్(21), జేసన్ రాయ్(10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కోల్‌కతా బౌలర్లలో సౌథీ(2/26), శివమ్ మావి(2/29), వరుణ్ చక్రవర్తి(2/26) రెండేసి వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో 19.4 ఓవర్లు ఆడిన నైట్‌రైడర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 119 రన్స్ చేసి గెలిచింది. శుభ్‌మన్ గిల్ (51 బాల్స్‌లో 10 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీ చేయగా నితీశ్ రాణా(25) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్(2/32) రెండు వికెట్లు తీశాడు. గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా, పవర్ ప్లే ముగిసే లోపు వెంకటేశ్ అయ్యర్(8), రాహుల్ త్రిపాఠి(7) ఔటవ్వడంతో కోల్‌కతా ఛేజింగ్‌లో నెమ్మదిగా ఆడింది. నితీశ్ రాణా అండతో గిల్ లక్ష్యాన్ని కరిగించాడు. వీరిద్దరూ చిన్న తేడాలో ఔటైనా దినేశ్ కార్తీక్(18 నాటౌట్), కెప్టెన్ మోర్గాన్(2 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ బ్యాటింగ్ వైఫల్యాన్ని కొనసాగించింది.