దుబాయి టీ20 లీగ్ లో నైట్ రైడర్స్

దుబాయి టీ20 లీగ్ లో నైట్ రైడర్స్

దుబాయి: యూఏఈ టీ20 లీగ్ పేరుతో పొట్టి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడానికి దుబాయి ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే లీగ్ లో పాల్గొనే జట్ల కోసం బిడ్డింగ్ నిర్వహించారు. కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు సంబంధించిన నైట్ రైడర్స్ గ్రూప్ ఓ టీమ్ ను కొనుగోలు చేసింది. అబుదాబి నైట్ రైడర్స్ (ఏడీకేఆర్)గా టీమ్ కు నామకరణం చేశారు. ఈ మేరకు కేకేఆర్ గ్రూప్ సీఈఓ వెంకీ మైసూర్ ఓ ప్రకటన విడుదల చేశారు. టీ20 క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని... ఈ క్రమంలో యూఏఈ టీ20 లీగ్ లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.

ఇక... 2008లో ప్రారంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్, నటి జూహీ చావ్లా సంయుక్తంగా కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) టీమ్ ను కొనుగోలు చేశారు. 2015లో వీరి భాగస్వామ్యంలోనే కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రిన్బ్యాగో నైట్ రైడర్స్ (టీకేఆర్) పేరుతో టీమ్ ను కొనుగోలు చేశారు. ఇటీవలనే అమెరికాలో నిర్వహిస్తున్న మేజర్ లీగ్ క్రికెట్ లో నైట్ రైడర్స్ తన ఫ్రాంచైజీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు దుబాయిలో నైట్ రైడర్స్ గ్రూప్ తమ నాలుగో ఫ్రాంచైజీని ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థ విస్తరించడం గర్వంగా ఉందని షారూఖ్ ఖాన్, జూహీ చావ్లా తమ సంతోషం వ్యక్తం చేశారు.