KKR vs RCB: పోరాడి ఓడిన బెంగళూరు.. ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు!

KKR vs RCB: పోరాడి ఓడిన బెంగళూరు.. ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు!

చావో రేవో మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్లు ఆఖరిబంతి వరకూ పోరాడారు. అయినప్పటికీ, వారిని విజయం వరించలేదు. ఈడెన్‌ గడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరుగు తేడాతో పరాజయం పాలయ్యారు. మొదట కోల్‌కతా 222 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో బెంగళూరు జట్టు 221 పరుగులు చేసింది. ఈ ఓటమితో డుప్లెసిస్ సేన అనధికారికంగా ప్లేఆఫ్స్ ఆశలను వదులుకుంది. లీగ్ దశలో వారింకా 6 మ్యాచ్‌లు ఆడాల్సివున్నా.. అన్నింటా విజయం సాధించిన ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిందే.

223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు విఫలమయ్యారు. కోహ్లీ (17) డుప్లెసిస్ (7) స్వల్ప స్కోర్ కే ఔటయ్యారు.ఈ దశలో విల్ జాక్స్ (32 బంతుల్లో 55 2 ఫోర్లు, 5 సిక్సులు) రజత్ పటిదార్(36 బంతుల్లో 50,7 ఫోర్లు, ఒక సిక్సర్) చెలరేగి ఆడారు. బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 8 ఓవర్లలోనే వీరిద్దరూ 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను విజయం దిశగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే వరుసగా రెండు ఓవర్ల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ కేకేఆర్ చేతుల్లోకి వెళ్ళింది. ఆ సమయంలో ప్రభుదేశాయ్(24), దినేష్ కార్తీక్ (25) జాగ్రత్తగా ఆడుతూ మ్యాచ్ ను ఆఖరి దాకా తీసుకెళ్లారు.

ఈ దశలో కేకేఆర్ మరోసారి మ్యాజిక్ చేసింది. కీలక దశలో కార్తీక్ ను ఔట్ చేసి మ్యాచ్ పై పట్టు బిగించారు. చివరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సిన దశలో కరణ్ శర్మ మూడు సిక్సులు కొట్టి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశాడు. ఇక చివరలో రెండు బంతుల్లో మూడు పరుగులు చేస్తే విజయం దక్కే పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి సమయంలో కరన్‌ శర్మ (20) ఔటయ్యాడు. చివరి బంతికి ఫెర్గూసన్‌ రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. ఫలితంగా ఒక్క పరుగు తేడాతో బెంగళూరు ఓటమి పాలయ్యింది.

అంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(50) హాఫ్ సెంచరీ చేయగా.. ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌(48), రింకూ సింగ్‌ (24), ఆండ్రీ రస్సెల్‌ (27 నాటౌట్), రమణ్‌దీప్‌ సింగ్‌ (24 నాటౌట్) పరుగులతో రాణించారు.