KKR vs RR: బట్లర్ అసమాన పోరాటం.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం

KKR vs RR: బట్లర్ అసమాన పోరాటం.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం

ఎదుట 224 పరుగుల భారీ లక్ష్యం.. ప్రత్యర్థి జట్టులో స్టార్క్, నరైన్, వరుణ్ చక్రవర్తి వంటి నాణ్యమైన బౌలర్లు. కానీ, అవేమీ అతన్ని అడ్డుకోలేకపోయాయి. అతనే.. జోస్ బ‌ట్లర్. ఓపెనర్‌గా వచ్చిన బట్లర్.. ఆఖరి బంతి వరకూ క్రీజులో నిల్చొని జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో ఎండ్‌లో వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లుగా వీడుతున్నా.. తాను మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అతని ఇన్నింగ్స్.. శత్రుదేశంపై ఒక సైనికుడిలా సాగింది. 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 107 పరుగులు చేసిన బట్లర్.. ఆఖరి బంతికి జట్టుకు విజయాన్ని అందించాడు.  

జైస్వాల్, శాంసన్ విఫలం

భారీ ఛేదనలో రాజస్థాన్‌కు మంచి ఆరంభం లభించలేదు. యశస్వి జైస్వాల్(19), సంజూ శాంస‌న్(12) త్వరగా పెవిలియన్ చేరారు. ఆ సమయంలో జోస్ బ‌ట్లర్(107 నాటౌట్; 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు), రియాన్ ప‌రాగ్ (34; 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) జోడి కోల్‌కతా బౌలర్లను ఎదుర్కొంటున్నారు. దేశవాళీ హీరోలు హర్షిత్ రాణా, వైభవ్ అరోరా వంటి యువ బౌలర్లను టార్గెట్ చేసి వీరు పరుగులు రాబడుతున్నారు. వీరిద్దరి ధాటికి రాజస్థాన్ పవర్ ప్లే ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నంలో ప‌రాగ్ వెనుదిరిగాడు. 

ఆపై కోల్‌క‌తా బౌలర్లు విజభించడంతో రాయ‌ల్స్ బ్యాట‌ర్లు వ‌రుస పెట్టి పెవిలియ‌న్‌కు క్యూ కట్టారు. ధ్రువ్ జురెల్(2), అశ్విన్(1), షిమ్రాన్ హెట్మెయర్ వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఆ సమయంలో రోవ్ మెన్ పావెల్(23; 13 బంతుల్లో ఒక ఫోర్, 3సిక్స్‌లు) బట్లర్ తో జతకలిసి స్కోర్ బోర్డు ముందు నడిపించాడు. నరైన్ వేసిన 17వ ఓవర్‌లో మొదటి మూడు బంతులను 6, 6, 4.. బాది రాజస్థాన్ విజయంపై ఆశలు రేకెత్తించాడు. అదే ఓవర్ ఐదో బంతికి పావెల్ ఔటైనా.. బట్లర్ టెయిలెండర్ల సాయంతో జట్టును గెలిపించాడు.

శతకం బాదిన నరైన్

అంతకుముందు కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. విండీస్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్‌ 109 (56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సులు) సెంచరీతో అదరగొట్టాడు. రఘువంశీ(30), రింకుసింగ్‌(20 నాటౌట్), రసెల్‌(13), శ్రేయస్‌(11), సాల్ట్‌(10),  వెంకటేశ్‌(8), రమణ్‌దీప్‌(1 నాటౌట్) పరుగులు చేశారు. రాజస్థాన్‌ బౌలర్లలో అవేశ్‌ 2, కుల్దీప్‌ సేన్‌ 2 వికెట్లు తీయగా.. బౌల్ట్‌, యుజ్వేంద్ర చెరో వికెట్‌ పడగొట్టారు.