కూకట్పల్లి, వెలుగు: లౌకికవాదం పేరుతో హిందూ సంస్కృతిపై జరుగుతున్న దాడులను, విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. డిజిటల్ మీడియా ద్వారా జరుగుతున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకుని, అదే డిజిటల్ మీడియాను వాడుకొని ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. భారత్ నీతి ఆధ్వర్యంలో శనివారం కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన డిజిటల్ హిందూ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మన దేశ సంస్కృతిని కించపరచటమే లక్ష్యంగా కుహనా మేధావులు చేస్తున్న ప్రచారాన్ని ఎదర్కోవడానికి డిజిటల్ మీడియాను ఉపయోగించుకోవాలని సూచించారు. సర్వేజన సుఖినోభవంతు అనే సద్భావనతో సాగే హిందూ భావజాలం కేవలం ఒక మతానికి పరిమితమైంది కాదని, అది భారతీయ జీవన విధానంలో భాగమని తెలిపారు. దేశానికి నెహ్రూ ప్రధాని అయిన తర్వాత ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ వ్యతిరేక ప్రచారానికి తెర తీశారని ఆయన ఆరోపించారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో సోషల్ మీడియా ప్రభావం విస్తరిస్తుందని, దీనిని ఉపయోగించుకుని హిందూ ధర్మాన్ని రక్షించుకోవటం కోసం యువత పని చేయాల్సిన అవసరముందన్నారు. భారతీయుల్లో హిందూ ధర్మం పట్ల చైతన్యం నింపేందుకు డిజిటల్ హిందూ మీడియాను ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత గురించి బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధర్‌రావు వివరించారు.
