ట్రంప్ ఫార్మా టారిఫ్స్ వల్ల భారత కంపెనీలపై ప్రభావం ఇదే.. ఏఏ స్టాక్స్ ఎఫెక్ట్ అవుతాయంటే..?

ట్రంప్ ఫార్మా టారిఫ్స్ వల్ల భారత కంపెనీలపై ప్రభావం ఇదే.. ఏఏ స్టాక్స్ ఎఫెక్ట్ అవుతాయంటే..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చెప్పినట్లుగానే ఫార్మా కంపెనీలపై తాజాగా 100 శాతం సుంకాలను విధించారు. దీని కింద అమెరికాకు వచ్చే బ్రాండెడ్ మందులపై ఈ సుంకాలు వర్తిస్తాయని చెప్పారు ట్రంప్. అయితే అమెరికాలో మందులు తయారు చేసి విక్రయించే సంస్థలపై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని తేలింది. ఈ క్రమంలో అమెరికాకు ఎక్కువగా ఫార్మా ఉత్పత్తులను పంపుతున్న భారత్ పై సుంకాల ప్రభావం గురించి చాలా మంది ఇన్వెస్టర్లలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

వాస్తవానికి అమెరికాకు ఇండియా నుంచి వెళ్లే మందుల్లో మెజారిటీ బ్రాండెండ్ మందులు కాదు జనరిక్స్ మాత్రమే. భారత మెుత్తం ఎగుమతుల్లో ఫార్మా వాటా 35 శాతం ఉండగా.. వాటి విలువ 10 బిలియన్ డాలర్ల వరకు ఉంది. అందుకే భారత ఫార్మా కంపెనీలు ట్రంప్ టారిఫ్స్ హీట్ చాలా తక్కువగానే చూస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

ప్రస్తుతం భారత ఫార్మా కంపెనీలు తమ ఆదాయంలో 30 నుంచి 50 శాతం వరకు అమెరికా మార్కెట్ల నుంచి పొందుతున్నాయి. ప్రస్తుతానికి పెద్ద ప్రమాదం లేనప్పటికీ ట్రంప్ భవిష్యత్తులో కాంప్లెక్స్ జనరిక్స్, కొన్ని స్పెషాలిటీ మందులను కూడా సుంకాల కిందికి తెస్తే ఇక్కడి కంపెనీలు భారీగా నష్టాలను చూడాల్సి వస్తుందని వెల్లడైంది. అయితే ట్రంప్ టారిఫ్స్ వల్ల ప్రస్తుతం.. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ఎక్కువగా ప్రభావితం అవుతాయని తెలుస్తోంది. ఎందుకంటే సన్ ఫార్మా ఆదాయంలో దాదాపు 30 శాతం అమెరికా మార్కెట్ల నుంచే వస్తోందని తేలింది. ఈ క్రమంలోనే శుక్రవారం 5 శాతం నష్టపోయిన సన్ ఫార్మా షేర్లు బీఎస్ఈలో సరికొత్త 52 వారాల కనిష్ఠం రూ.1547.25ని తాకింది. 

ఇక మిగతా కంపెనీల విషయానికి వస్తే గ్లాండ్ ఫార్మా జనరిక్స్ ఎగుమతుల్లో ఉండగా.. అరబిందో, జైడస్, ఆల్కెమ్, టొరెండ్ ఫార్మా కంపెనీలు కూడా అప్రమత్తంగా తమ జనరిక్ ఎగుమతులపై ట్రంప్ టారిఫ్స్ తర్వాత దృష్టి సారిస్తున్నాయి. అయితే యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్స్ అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి రాబోతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.