ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ ఎత్తేశారు.. ఈసారి మీరు కట్టే ప్రీమియం ఎంత తగ్గుతుందో తెలుసుకోండి?

ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ ఎత్తేశారు.. ఈసారి మీరు కట్టే ప్రీమియం ఎంత తగ్గుతుందో తెలుసుకోండి?

GST on Insurance: సెప్టెంబర్ 3న స్టార్ట్ అయిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న సంస్కరణల గురించి ప్రకటించారు. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ పాలసీలపై ఉన్న జీఎస్టీని సున్నాకు తగ్గిస్తున్నట్లు చెప్పారు. గతంలో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై 18 శాతం జీఎస్టీ అమలులో ఉన్న సంగతి తెలిసిందే.  చాలా కాలంగా ఈ రంగం జీఎస్టీ రేటును 12 శాతానికి తగ్గించాలని కోరిగా తాజా సంస్కరణల్లో దీనిని ఏకంగా జీరో జీఎస్టీ కేటగిరీలోకి తీసుకొచ్చింది కేంద్రం. మారిన కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తున్నాయి. 

ఉదాహణకు గతంలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకోసం ప్రీమియం రూ.10వేలు ఉంటే దానిపై 18 శాతం జీఎస్టీ కలిపితే పాలసీదారులు మెుత్తంగా రూ.11వేల 800 కట్టాల్సి వచ్చేది. అంటే ఇక్కడ రూ.18వందలు జీఎస్టీ అదనంగా పాలసీ ప్రీమియంపై పడేది. కానీ ప్రస్తుతం ఈ జీఎస్టీ రేటును సున్నా శాతానికి తగ్గించటంతో పాలసీదారులు కేవలం రూ.10వేలు పాలసీ మెుత్తం చెల్లిస్తే సరిపోతుంది. అంటే దాదాపు పదివేలకు 18వందల చొప్పున తగ్గింపు అందుకుంటారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులతో యులిప్ ప్లాన్స్, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్, టర్మ్ ప్లాన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ జీఎస్టీ, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ప్రయోజనం కలగనుంది. 

ALSO READ : మార్కెట్లలో జీఎస్టీ తగ్గింపుల జోరు..

అసలు సమస్య ఇదే..
ప్రస్తుతానికి పాలసీదారులకు జీఎస్టీ మినహాయింపు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో పాలసీ ప్రీమియం రేట్లు పెరగొచ్చనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీలు పాలసీదారుల నుంచి కలెక్ట్ చేసే ప్రీమియంపై 18శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో వారు చెల్లించే ఏజెంట్ కమిషన్, మార్కెటింగ్ ఖర్చులు, ఆఫీసు అద్దెలపై ప్రభుత్వానికి జీఎస్టీ కడుతున్నాయి. దీంతో జీఎస్టీ చట్టాల కింద వారు పన్నులను వసూలు చేస్తున్న వాటికి చెల్లిస్తున్నవాటిని సర్థుబాటు చేసుకుంటున్నారు. మిగిలిన మెుత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి. కానీ ఇకపై ప్రీమియంపై జీఎస్టీ లేకపోవటంతో ప్రభుత్వానికి కట్టే జీఎస్టీ తిరిగి క్లెయిమ్ చేసుకోవటానికి కుదరదు. అందువల్ల కంపెనీలు ఇకపై ఆ భారాన్ని కవర్ చేసుకునేందుకు పాలసీల రేట్లు పెంచుతాయని నిపుణులు అంటున్నారు.