111 జీవో రద్దుపై పీసీసీ నిజనిర్ధారణ కమిటీ.. చైర్మన్​గా కోదండ రెడ్డి నియామకం

111 జీవో రద్దుపై పీసీసీ నిజనిర్ధారణ కమిటీ.. చైర్మన్​గా కోదండ రెడ్డి నియామకం

హైదరాబాద్, వెలుగు : జీవో 111 రద్దుపై పీసీసీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి సూచనల మేరకు పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​మహేశ్​ కుమార్​ గౌడ్​ శుక్రవారం కమిటీని వేశారు. కిసాన్​ కాంగ్రెస్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డిని చైర్మన్​గా నియమించారు. సభ్యులుగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే టి. రామ్మోహన్​రెడ్డి, రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహారెడ్డి, పీసీసీ జనరల్​సెక్రటరీ జ్ఞానేశ్వర్, ఆర్థిక వేత్త లుబ్నా సార్వత్, సేవ్​అర్బన్​ లేక్స్​(సోల్​) ఫౌండర్ కన్వీనర్ జస్వీన్​ జైరథ్​లను నియమించారు. కాగా, ఈ కమిటీ శుక్రవారం గాంధీభవన్​లో తొలి సమావేశాన్ని  నిర్వహించింది. 111 జీవోను ఎత్తేయడం వల్ల జంట జలాశయాలకు నష్టం జరుగుతుందని కోదండ రెడ్డి అన్నారు. పర్యావరణ వేత్తలు, అన్ని వర్గాల వారితో సమావేశమై లోతు గా అధ్యయనం చేస్తామని, సమగ్ర నివేదిక ఇస్తామని పేర్కొన్నారు.