కవిత విచారణ.. తెలంగాణ సమస్య ఎట్లయితది?

కవిత విచారణ.. తెలంగాణ సమస్య ఎట్లయితది?
  •     ఆమె లిక్కర్ స్కామ్​లో ఉండి మహిళా హక్కులపై పోరాడుతదా?: కోదండరాం  
  •     కవితకు పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటని ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: మహిళలపై దాడులకు లిక్కరే ప్రధాన కారణమని.. అలాంటి లిక్కర్ స్కామ్ లో ఉన్న ఎమ్మెల్సీ కవిత మహిళా హక్కుల కోసం పోరాడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. గురువారం నాంపల్లిలోని పార్టీ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్ లో కవిత విచారణను తెలంగాణ సమస్యగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని, అది రాష్ట్ర సమస్య ఎలా అవుతుందని కోదండరాం ప్రశ్నించారు. కవితను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయటం లేదని నిలదీశారు.

ఆమె అరెస్ట్ అయితే పార్టీ అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించటం సిగ్గుచేటు అని అన్నారు. ‘‘రాష్ర్టంలో చర్చించడానికి ఎన్నో సమస్యలు ఉండగా, కవిత అంశంపై చర్చించడం బాధాకరం. నిరుద్యోగం, కరెంట్ కోతలు, మహిళల భద్రత, పోడు భూములు, కౌలు రైతులు.. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ కవిత అంశం తెలంగాణ సమస్య ఎట్లయితది? దాన్ని తెలంగాణకు ముడిపెట్టడం ఏంది? సీఎం కేసీఆర్ చట్ట ప్రకారం పని చేయాలి. కానీ కవితకు తెలంగాణ సమాజం అండగా ఉంటుందని ఎట్ల అంటరు?” అని మండిపడ్డారు. వ్యాపారాలు చేసుకునేందుకు అధికారాన్ని వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. వందల ఎకరాలు కబ్జా చేస్తూ పేదలకు ఇండ్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఇయ్యాల తెలంగాణ బచావో సదస్సు... 

మిలియన్ మార్చ్ కు 12 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘తెలంగాణ బచావో’ పేరుతో సదస్సు నిర్వహించనున్నట్లు కోదండరాం తెలిపారు. శుక్రవారం వీఎస్టీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్న ఈ సదస్సుకు పలు పార్టీల నేతలు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు హాజరవుతారని చెప్పారు. ఈ మీటింగ్ కు ఉద్యమకారులు అందరూ రావాలని,  రాష్ర్టంలోని సమస్యలపై చర్చించి కార్యాచరణ ప్రకటిద్దామని పిలుపునిచ్చారు. ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్ ఎంతో అపురూప ఘట్టమని, అప్పటి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవి దాటుకొని ట్యాంక్ బండ్ కు చేరుకున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ వద్దన్నా మిలియన్ మార్చ్ ను సక్సెస్ చేసుకున్నామన్నారు.