హైకోర్టు మొట్టికాయ‌లు వేసినా ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేదు

హైకోర్టు మొట్టికాయ‌లు వేసినా ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేదు

హైకోర్టు చెప్పిన మేరకు విస్తృతంగా ఫ్రీగా క‌రోనా పరీక్షలు చేయాలన్నారు టీజేఎస్ అధ్య‌క్షుడు కోదండరాం. శుక్ర‌వారం టీజేఎస్ కార్యాల‌యంలో అఖిల‌ప‌క్షం మీడియా స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సమావేశంలో అఖిలపక్ష నేతలు కోదండరాం, ఎల్.రమణ, చాడ వెంకట్ రెడ్డి, జూలకంటి రంగారెడ్డి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కోదండ‌రాం మాట్లాడుతూ..ఆరు నెలల పాటు ప్రతి కుటుంబానికి రూ. 7,500లతో పాటు ఉచిత రేషన్ ఇవ్వాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం తరహాలో పట్టణ ఉపాధిహామీ పథకం ప్రవేశం పెట్టి ఉపాధి కల్పించాలన్నారు.

తొలగించిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకుని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షం ఎన్ని పోరాటాలు చేసినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. హైకోర్టు కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా చలనం లేదన్నారు. అఖిలపక్షం ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. డిమాండ్లు పరిష్కరించకపోతే తమ ఉద్యమ కార్యాచరణను ఉదృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు కోదండ‌రాం.