కేసీఆర్​ మళ్లీ గెలిస్తే చేతికి చిప్పే : కోదండరాం

కేసీఆర్​ మళ్లీ గెలిస్తే చేతికి చిప్పే : కోదండరాం
  •    ఎవరైనా ప్రశ్నిస్తే ఉద్యమ కాలం నాటి కేసులతో బైండోవర్లు  చేస్తున్నరు
  •     ముందు కేసీఆర్​ను బైండోవర్ ​చేయాలె
  •     అంతా కలిసి కాంగ్రెస్​ను గెలిపించుకోవాలని పిలుపు 
  •     టీజేఎస్​ అధ్యక్షుడు కోదండరామ్​

హనుమకొండ/ భీమదేవరపల్లి, వెలుగు: సీఎం కేసీఆర్​ అసత్య ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నాడని, కాళేశ్వరం ప్రాజెక్టులాగే బీఆర్ఎస్ కూడా​ఈ ఎన్నికల్లో కొట్టుకుపోతుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరామ్​అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రాజెక్టుగానే మిగిలిపోయిందని, కాళేశ్వరంలో రూ.25 వేల కోట్లు గల్లంతయ్యాయన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ జేఏసీ కో కన్వీనర్​ చెప్యాల ప్రభాకర్​ భార్య, ఉద్యమకారిణి జ్యోతి సంతాప సభలో పాల్గొన్నారు. 

తర్వాత వరంగల్​ప్రెస్​ క్లబ్​లో తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల ఎన్నికల సన్నాహక సదస్సుకు చీఫ్ గెస్ట్​ గా హాజరై మాట్లాడారు. తొమ్మిదిన్నరేండ్లలో రూ.లక్ష కోట్లు ఇరిగేషన్ పై ఖర్చు పెట్టినా ఫలితం లేకుండాపోయిందన్నారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనికిరాకుండా పోయాయని విమర్శించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూములు గుంజుకుని, రాత్రిపూట గ్రామాన్ని ఖాళీ చేయించారని,  అయినా ఇంతవరకు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తే చిప్ప చేతికి వస్తుందన్నారు. ఎన్నికల్లో పార్టీలు కాకుండా..తెలంగాణ ప్రజలు గెలవాల్సిన అవసరం ఉందన్నారు.

కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే..

రాష్ట్రంలో ఎవరైనా అన్యాయాలను ప్రశ్నిస్తే ఉద్యమకాలంలో పెట్టిన కేసులతో మళ్లీ బైండోవర్లు చేయిస్తున్నారని, రైతుల ఆత్మహత్యలను ఆపలేని సీఎం కేసీఆర్​ను ముందుగా బైండోవర్​ చేయాలని కోదండరామ్​ అన్నారు. కేసీఆర్​ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, ఉద్యోగాల భర్తీ విషయంలో మొదటి నుంచీ అబద్ధం చెబుతున్నాడన్నారు. 2015లో లక్షా 7 వేల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తానని హామీ ఇచ్చి.. లక్ష 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నాడన్నారు.

కానీ, ఇంతవరకు 35 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, చరిత్రలో ఎన్నడూ లేనంతగా 16 సార్లు పరీక్షా పేపర్లు లీక్​ అయ్యాయని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏం కాలేదని రెండో అబద్దం చెప్తున్నాడని, బ్యారేజీ పనికి రాదని కేంద్ర కమిటీ రిపోర్ట్ ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇంజినీర్లను కాదని కేసీఆర్ బ్యారేజీ నిర్మించడం వల్లే రూ.లక్ష కోట్ల ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందన్నారు. ఇక ధరణిలో తప్పులు సరిచేయండని అడిగితే.. మొత్తం ధరణినే తీసేస్తామంటున్నారని మూడో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. సన్న చిన్న కారు రైతుల ను ఆదుకోవాలని, కేసీఆర్​అవినీతిపై దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. 

ఈ అంశాలన్నీ కాంగ్రెస్ ఒప్పుకుందని, అందుకే ఆ పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు రిటైర్డ్ ప్రొఫెసర్​ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ కేసీఆర్​ ప్రచార సాధనాలు, ఉద్యోగ సంఘాలను అధీనంలో పెట్టుకున్నాడని,  ప్రశ్నించిన వాళ్లను వేధింపులకు గురి చేస్తున్నాడన్నారు.  కేసీఆర్ ఒక చక్రవర్తిలా వ్యవహరిస్తుంటే.. ఆయన ఫ్యామిలీ ఈస్ట్​ ఇండియా కంపెనీలా తెలంగాణను ఏలుతోందని మండిపడ్డారు. టీజేఎస్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి శ్రీనివాస్​, వివిధ జిల్లాల అధ్యక్షులు జావీద్​, డోలి సత్యనారాయణ, రత్నం కిరణ్​, అశోక్​వర్ధన్​ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్​ సాయిని నరేందర్​ పాల్గొన్నారు.