
- ఓటమి ఖాయమని కేసీఆర్, కేటీఆర్‌కు అర్థమైంది: ఆకునూరి మురళి
- తెలంగాణను ఆగం పట్టించిందే ఆ కుటుంబమని ఆరోపణ
- పదేండ్లలో నిర్బంధాలు, అరెస్టులు పెరిగాయి: హరగోపాల్
- కనీసం మంత్రులనూ కలవని కేసీఆర్.. ప్రజలను ఏం కలుస్తరని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నియంత సర్కారును గద్దె దించాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ప్రజాస్వామిక వాదులు, పౌర హక్కుల కార్యకర్తలు స్పష్టం చేశారు. ఇంతటి అహంకార, నియంత పాలనను గతంలో ఎన్నడూ చూడలేదని జనాల్లో అభిప్రాయం ఉందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల రూపంలో నయా రజాకార్లను చూస్తున్నామంటూ జనాలు చెప్తున్నారని పేర్కొన్నారు. సోమవారం ‘వీ6’ చానెల్ నిర్వహించిన ‘‘ఎట్లుండాల్సిన తెలంగాణ.. ఎట్లయిపోయిందన్న’’ చర్చా వేదికలో ప్రొఫెసర్ కోదండరాం, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, పౌరహక్కుల కార్యకర్త ప్రొఫెసర్ హరగోపాల్‌లు పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో వివిధ గ్రామాల్లో పర్యటించిన వారు ఆ విశేషాలను పంచుకున్నారు. జనాలు ఏమనుకుంటున్నారు.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరు ఎలా ఉంది వంటి వివరాలను వెల్లడించారు.
మూడేండ్ల నుంచే కేసీఆర్‌పై వ్యతిరేకత: కోదండరాం
ఇంతటి అహంకారపూరిత, నియంత పాలనను చూడలేదని ప్రజలు భావిస్తున్నారని టీజేఎస్చీఫ్ కోదండరాం అన్నారు. రజాకార్లను తాము చూడలేదని, కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తల రూపంలో నయా రజాకార్లు తిరుగుతున్నారని ప్రజలు చెప్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన రావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ దోపిడీ, నిరంకుశత్వంపై ప్రజలు తిరుగుబడుతున్నారన్నారు. మూడేండ్ల క్రితమే ఓ రైతు.. కేసీఆర్‌ను గద్దె మీది నుంచి దింపేయాలని తనతో చెప్పారన్నారు.
అప్పటి నుంచే కేసీఆర్‌పై వ్యతిరేకత పెరిగిందన్నారు. ‘‘పదేండ్లలో మేం నిరుద్యోగం, ధరణి, పోడు పట్టాల వంటి అనేక సమస్యలపై పోరాడాం. సొంత ఆస్తిని పెంచుకోవాలని కేసీఆర్ ఆలోచించారు. దానిని ఎవరూ ప్రశ్నించకుండా నిరంకుశ పాలన చేస్తున్నరు. అది అర్థమై ఈ నిరంకుశ పాలనను అంతమొందించాలన్న నిర్ణయానికి వచ్చాం. అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నం. కాళేశ్వరం ప్రాజెక్టుతో నష్టం జరిగింది. కనీసం 50 వేల ఎకరాలకూ నీళ్లందుతలేవు. సర్వే చేయకుండానే ప్రాజెక్టును కట్టారు. ఇంజనీర్లు చెప్పింది వినలేదు. నాణ్యతా ప్రమాణాలను పాటించలేదు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లను దండుకున్నారు.
అత్యంత అవినీతిమయమైన ప్రాజెక్టు ఇది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత.. కేవలం డబ్బు కోసమే ప్రాజెక్టును కట్టార ని జనాలకు అర్థమైంది. ధరణిని తెచ్చి.. గతంలో భూస్వాముల నుంచి పేదలకు వచ్చిన భూములన్నీ మళ్లీ ఇప్పుడు దొరలు, భూస్వాముల చేతుల్లోకి వెళ్లిపోయాయి. సొంత లాభం కోసమే కేసీఆర్ అన్నీ చేసుకున్నారని జనం నమ్ముతున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ సహా అన్ని ప్రాజెక్టుల్లోనూ కమీషన్ల లెక్క చూసుకున్నాకే పనులు చేస్తున్నారు. కేసీఆర్‌ను సాగనంపాలని జనాలు అంటున్నారు. గ్రామాల్లో భూమి ఖాళీగా కనిపిస్తే బీఆర్ఎస్ వాళ్లు కబ్జాలు పెడ్తున్నారు. వ్యతిరేక వర్గాలపై పోలీసులతో దాడి చేయిస్తారు. సంఘాలను చీలుస్తారు.. భూ రికార్డుల్లో సమస్యలు తీసుకొస్తారు.. కేసులు పెడ్తారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. అందరూ తిరగబడుతున్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు తెగించారు. ఉమ్మడి వనరులను కొల్లగొడుతుంటే ప్రజల ఓపిక నశించింది. ప్రజలు చైతన్యవంతులయ్యారు’’ అని కోదండరాం చెప్పారు.
సెంట్రల్ లైబ్రరీకి కేటీఆర్ పోతే చెప్పుతో కొడతరు: ఆకునూరి మురళి
ఎక్కడకు పోయినా ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, అంతటి వ్యతిరేకత ను తామెన్నడూ చూడలేదని ఆకునూరి మురళి చెప్పారు. తమ బస్సు యాత్రను చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. జనాలే తమకు రక్షణ కల్పించా రని గుర్తుచేశారు. కమీషన్లు, పేపర్లీకులు, కబ్జాలు ఇవన్నీ జనాల్లోకి బాగా పోయాయన్నా రు. ‘‘గెలిచాక డిసెంబర్ 4న అశోక్ నగర్ , చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని కేటీఆర్ అంటున్నారు. మరి, ఈ తొమ్మిదన్నరేండ్లు గాడిదలు కాశారా? విద్య, వైద్యాన్ని నిర్లక్ష్యం చేశామని ఒప్పుకున్నారు.
బీఆర్ఎస్ వాళ్లకు ఓటమి ఖాయమని అర్థమైపోయింది. ఇన్నేండ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక్క విద్యాసంస్థ ను కట్టలేరా? ఒక్క సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ కట్టలేరా? రూ.450 కోట్లు పెట్టి గడీని కట్టి.. పేరేమో ప్రగతి భవన్ అని పెట్టి, పాలనను గాలికొదిలేశాడు. 90 వేల ఫైల్స్ చూడకుం డానే పక్కన పడేశారు. పేదల బతుకులు ధ్వంసమయ్యాయి. బిశ్వాల్ కమిటీ 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని నివేదిక ఇచ్చింది. రిటైర్ అయిన వాళ్లను కలుపుకుంటే, దాదాపు 2.5 లక్షల ఖాళీలుంటాయి. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులున్నారు. ఉద్యోగాలు రాక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణను ఆగం పట్టించింది కేసీఆరే అని ప్రజలందరికీ అర్థమైంది.’’ అని ఆకునూరి మురళి పేర్కొన్నారు.
పోరాటాలు చేసే హక్కు ప్రజలకుంది: హరగోపాల్
తొమ్మిదిన్నరేండ్లలో పౌర హక్కులకు కలిగిన భంగంపైనే ప్రజల్లోకి వెళ్తున్నామని హరగోపాల్ అన్నారు. ‘‘ప్రజలకు న్యాయం జరగకుంటే పోరాటాలు చేసే హక్కులూ ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, డాక్టర్లు, ప్రొఫెషనల్స్ అంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అదే రాజ్యాంగం కల్పించిన హక్కు. అదే ప్రజాస్వామ్యం. కానీ, కేసీఆర్ ప్రభుత్వం హయాంలో హక్కులను కాలరాస్తున్నారు. ఇందిరా పార్క్ వద్ద గతంలో ఎవరైనా ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ ఉండేది. కానీ, ఇప్పుడా స్వేచ్ఛ లేదు.
సమావేశాలు పెట్టుకున్నా, హక్కుల కోసం ర్యాలీలు తీయాలనుకున్నా వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణలో ఇలా హక్కులను కాలరాయడం చూస్తే బాధేస్తున్నది. కేసీఆర్‌లో అహంకారం బాగా ఉంది. ఉద్యమ స్ఫూర్తిని కేసీఆర్ మరచిపోయారు. మంత్రులనూ ప్రగతిభవన్‌లోకి రానివ్వరు. ఆయన ఇంక ప్రజలను ఏం కలుస్తరు. ప్రభుత్వాలు మారితేనే ప్రజలకు మేలు. సంస్కారవంతమైన పాలన, ప్రజలను గౌరవించి ప్రేమించే పాలన వస్తే బాగుంటుంది. వేరే ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసం మా పోరాటాలు ఆగవు. ప్రశ్నించడం మానం’’ అని అన్నారు.