మాట్లాడుతున్న ఒక్క మంత్రి కూడా ఉద్యమంలో లేడు : కోదండరాం

మాట్లాడుతున్న ఒక్క మంత్రి కూడా ఉద్యమంలో లేడు : కోదండరాం

ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీరును తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ తప్పుపట్టారు. సీఎం తీరు అలాగే ఉంది… మంత్రుల తీరు కూడా మొండి వైఖరిని తలపించేలానే ఉందని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో ఎందుకు మాట్లాడరని తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు.మాట్లాడితే సమస్య పరిష్కారం అయ్యేది కాదా అని ఆయన అన్నారు.

ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని మంత్రులు ఇప్పుడు మాట్లాడుతున్నారని అన్నారు కోదండరామ్. “డ్రైవర్ అఘాయిత్యం చాలా దారుణం. రెచ్చగొట్టేలాగా ఓ సీఎం, మంత్రులు అలాగే మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కానేకాదు. ఈనాడు మాట్లాడుతున్న మంత్రుల్లో ఒక్కలు కూడా మాతో ఆనాడు ఉద్యమంలో నడవలేదు. ఆరోజు పిల్లల ప్రాణాలు పోతుంటే చూసినవాళ్లు ఈ మంత్రులు కాదు. మేం పాడెలు కట్టినం.. శవాలు మోసినం.. మాకు తెలుసు ఆ బాధ ఎట్ల ఉంటదనేది.. సమస్య పరిష్కారం కాదు అనే మాటను మేం ఒప్పుకోం. ఆ బకాయిలను చెల్లించే బాధ్యత ప్రభుత్వానిదే. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారు. సీఎఁ కేసీఆర్ ఇపుడు మాట మార్చారు. రాయితీలు కల్పిస్తాం.. బతుకులు మారుస్తాం అని ఆనాడు చెప్పిన కేసీఆర్.. ఇపుడు బస్సులు అమ్ముతం.. మిమ్ములను లాభాల్లోకి తీసుకుపోతాం అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా నెలవారీగా బకాయిలు చెల్లిస్తామని సీఎం అన్నారు. కనీసం డీజిల్ ధరలు పెరగడం వల్ల పడిన భారం రూ.వెయ్యి కోట్లైనా కట్టాలి. ఆర్టీసీకి 70, 80వేల కోట్ల ఆస్తులున్నాయి. ఒక్క ఇమ్లీబన్ ఒక్కటే 4 వేల కోట్లు ఉంటుంది. బుక్ వాల్యూ తీసుకున్నా చాలా ఎక్కువ. వెయ్యి కోట్ల అప్పు పెద్ద భారమేంకాదు. కార్మికులను తప్పుపట్టొద్దు. ప్రజలు అర్థం చేసుకోవాలి. శ్రీనివాస్ రెడ్డి చర్యకు ప్రభుత్వానిదే బాధ్యత. ” అన్నారు కోదండరాం.

సెలవులు పొడగించడం అనేది ప్రభుత్వపు మూర్ఖపు చర్యకు ఓ ఉదాహణ అన్నారు కోదండరామ్.