కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు కోదండరాం!

కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు కోదండరాం!

హైదరాబాద్: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని సమాచారం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ రెండో తేదీతో రాష్ట్రానికి  సంబంధించిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న వారిలో వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి  సంతోష్ కుమార్ ఉన్నారు. ప్రస్తుతం శాసన సభలో ఉన్న సభ్యుల సంఖ్యాబలం దృష్ట్యా ఇందులో  రెండు స్థానాలు కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉంది. వాటిలో ఒకటి ప్రొఫెసర్ కోదండరాం కు కేటాయిస్తారని తెలుస్తోంది. 

ఎన్నికలకు ముందు కరీంనగర్ లో ప్రొఫెసర్ కోదండరాం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పొత్తులో భాగంగా నాలుగు అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన అధినాయకత్వం ప్రస్తుతానికి ఇవ్వలేమని  పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఏప్రిల్ లో ఖాళీ అయ్యే పోస్టుల్లో ఒకటి కోదండరాం కు అకామిడేట్ చేయనున్నట్టు సమాచారం. మరో  పోస్టు కోసం భారీగానే పోటీ ఉందని తెలుస్తోంది. ఆ ఒక్క స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి, సంగారెడ్డి నుంచి ఓటమి పాలైన జగ్గారెడ్డిని రాజ్యసభకు పంపుతారనే వాదన వినిపిస్తోంది. అయితే వీరిద్దరిలో ఎవరిని పెద్దల సభకు పంపుతారో తేలాలంటే ఇంకా కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే..!