మరో పోరాటానికి సిద్ధమవుదాం

మరో పోరాటానికి సిద్ధమవుదాం

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ తో మాట్లాడుతూ ‘అన్యాయం జరుగుతదని తెలిసి ఆంధ్ర రాష్ట్రంతో విలీనానికి ఎందుకు ఒప్పుకున్నార’ని అడిగారట. దానికి ఆయన తడుముకోకుండా ‘మేం విలీనాన్ని వ్యతిరేకిస్తూ 50వ దశకంలో కొట్లాడినం. విలీనానికి ప్రాతిపదికైన పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోతే అప్పటి ప్రభుత్వాలను నిలదీసినం. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదని గ్రహించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నం’ అని సూటిగా జవాబిచ్చారు. ఈ ఘటనను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకునే అవకాశం 69 ఏండ్ల పోరాటాల కారణంగా, అనేక బలిదానాల ఫలితంగా, మరెందరిదో కృషి వలన దక్కిందని చెప్పడానికే. అవతరణ దినం ఈ చరిత్రను గుర్తు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నది. అమరులైన వారిని స్మరించుకోవడానికి ఇదొక సందర్భం. ఇవి రెండూ గుర్తుంటేనే వర్తమానాన్ని సమీక్షించుకుని, భవిష్యత్​కు దారి వేసుకోగలం. 

1952లోనే మొదలు
1952 నాటి ముల్కీ ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్​కు స్ఫూర్తినిచ్చింది. ఆ తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ హైదరాబాద్ రాష్ట్ర ప్రజల అభిప్రాయ సేకరణకు వచ్చింది. ఈ విజ్ఞాపనల్లో అత్యధిక భాగం విలీనాన్ని వ్యతిరేకించాయి. అయినా ఆంధ్రా నాయకుల ఒత్తిడి మేరకు హైదరాబాద్ రాష్ట్రాన్ని విడగొట్టి భాషా ప్రాతిపదికన తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రా రాష్ట్రంతో విలీనం చేసినారు. ఈ సందర్భంగా చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు, హక్కులు లభించినాయి. ఇవన్నీ నీటి మూటలు కావడంతో 1968 లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. కేంద్రం బలంగా ఉండటం, నాయకత్వానికి లేకపోవడంతో ఆ ఉద్యమం విజయవంతం కాలేదు.

జీవితాలు బాగుపడతాయనే..
మలిదశ ఉద్యమానికి 1989 లోనే అంకురార్పణ జరిగినా అది ప్రజా ఉద్యమంగా మారింది 1996 తర్వాతే. 2001లో టీఆర్ఎస్ నేతృత్వంలో ఉద్యమానికి రాజకీయ నాయకత్వం ఏర్పడింది. రాజ్యాంగం ప్రజాస్వామిక తెలంగాణను ఇవ్వదని, చట్టం భౌగోళిక తెలంగాణను మాత్రమే ఏర్పాటు చేస్తుందని, ప్రజలను ఉద్యమంలో భాగం చేయగలిగితేనే మనం కోరుకున్న తెలంగాణ నిర్మాణానికి అవకాశం కలుగుతుందని ప్రొఫెసర్ జయశంకర్ వంటి వారు వారికి చెప్పినారు. ప్రజాస్వామిక తెలంగాణ  లక్ష్యంగానే అందరూ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసినారు. అందుకే ప్రతి ఒక్కరు తెలంగాణ ఏర్పడితే తమ జీవితం బాగుపడుతుందని నమ్మినారు.

కనీవినీ ఎరుగని స్థాయిలో ఉద్యమం
1969 ఉద్యమంలో ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు అందరూ ప్రజాసమితిలో చేరినారు. మలిదశ ఉద్యమంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ విడివిడిగా పనిచేసినాయి. అందుకే 2009లో వాటి మధ్య సమన్వయం సాధించడానికి ఒక వేదిక అవసరమైంది. ఆ పాత్రను జాక్ పోషించింది. జాక్ లో చేరినా ప్రజాసంఘాలు తమ ఉనికిని కోల్పోలేదు. ప్రపంచమంతటా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చాలా ఉద్యమాల్లో ఆత్మహత్య ఒక నిరసన రూపంగా వ్యక్తమైంది. అయితే  శ్రీకాంతాచారి నుంచి మొదలై తెలంగాణలో జరిగినన్ని  ఆత్మహత్యలు ఇంకెక్కడా జరగలేదు. అందుకే ఈ ఉద్యమం ప్రజల చైతన్య స్థాయిని బాగా ప్రభావితం చేసింది. కానీ, కనీవినీ ఎరుగనిరీతిలో సాగిన ఆందోళనలు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టినాయి.

పాలకులు కాదు.. పాలన మారాలె
తెలంగాణ వస్తే ప్రజాస్వామిక పాలన వస్తుందని ఆశ పడినం. కానీ, ఇదివరకెన్నడూ చూడని నియంతృత్వ పాలన నడుస్తున్నది. మనం ప్రేక్షకులుగా ఉండిపోవడానికి రాష్ట్రాన్ని కోరకోలేదు. పాలకులు మారడం కాదు పాలన మారాలన్నదే ఉద్యమ లక్ష్యం. ఏడేండ్ల టీఆర్ఎస్​ పాలన ఈ లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నది. అవతరణ దినోత్సవం జరుపుకోవడం అంటే ఉద్యమ విలువలను అర్థం చేసుకోవడం. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన నేటి తెలంగాణలో ఆవిర్భావ దినం జరుపుకోవడమంటే రాజ్యాంగ విలువలను పాదుకొల్పడమని గుర్తించాలి. అందుకే ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మరో ఉద్యమం అవసరమవుతుందని చెప్పినాడు. ఆవిర్భావ దినం రోజైన తెలంగాణ రాష్ట్ర సాధనతో మన పని అయిపోలేదని గుర్తించుదాం. ప్రజాస్వామిక తెలంగాణ కోసం మన పోరాటాన్ని కొనసాగించడానికి సిద్ధమవుదాం.

కొట్లాడినోళ్లకు న్యాయం జరగలే
ఇవాళ తెలంగాణ సాధించుకున్న తృప్తి లేదు. ఏనోట విన్నా కొట్లాడిన వారికి న్యాయం జరుగుతలేదనే మాట వినబడుతున్నది. కేసీఆర్​ కుటుంబమే లబ్ధి పొందిందనే అభిప్రాయం బలంగా ఉన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాతా బతుకులేమీ మారలేదనే అభిప్రాయం కూడా బలంగా ఉన్నది. ఏడేండ్ల పాలనలో ప్రజాస్వామిక విలువలను పాటించలేదు. ఉద్యమ స్ఫూర్తి అడుగంటి పోయింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి. నిరసన హక్కు ప్రజాస్వామ్యానికి గుండె లాంటిది. కానీ, నిరసన తెలపడాన్ని నేరంగా చూసే పాలన రాష్ట్రంలో సాగుతున్నది. వీరికన్నా ఆంధ్రా పాలకులే నయమని ప్రజలు అనుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

- ఎం.కోదండరామ్, అధ్యక్షుడు, తెలంగాణ జన సమితి