సూర్యాపేట జిల్లా: ఆర్టీసీ సమ్మెకు సీఎం కేసీఆర్ మాత్రమే కారణమన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. గురువారం సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. కాంట్రక్టర్ల ప్రయోజనాల కోసం సీఎం రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని ఇద్దరు,ముగ్గురు పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నారన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉంది అని పదే పదే చెబుతున్న సీఎం.. ఈ సంవత్సరం ప్రభుత్వ ఆదాయం ఎందుకు పడిపోయిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సమ్మె విజయవంతం కోసం తెలంగాణ సమాజం మొత్తం అండగా నిలుస్తుందన్నారు కోదండరాం. ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతున్నారని, కేసీఆర్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం మొత్తం ఏకమవుతున్నదని చెప్పారు. ఆంధ్ర పాలకులను తరిమికొట్టిన మనకు…కేసీఆర్ మెడలు వంచడం పెద్ద పనేం కాదన్నారు. 19 న జరిగే రాష్ట్ర బంద్ కు అందరూ సహకరించి విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.

