
ముంబై: టీమిండియాకు లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్ లో పూర్తిస్థాయి కెప్టెన్ గా పగ్గాలు చేపట్టనున్న రోహిత్ శర్మ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని వెటరన్ పేసర్ అజిత్ అగార్కర్ అన్నారు. ఫిట్ గా ఉండటమే అతడి ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ అన్నాడు. ఇంతకు ముందు జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన ధోనీ, కోహ్లీలు.. గాయాల కారణంగా ఒక్క మ్యాచ్ కూ దూరమవ్వలేదని, ఈ విషయంలో వారిని రోహిత్ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
‘ఫిట్ గా ఉండటం అనేది రోహిత్ ముందున్న పెద్ద సవాల్. ఇప్పటికే అతడు చాలామార్లు గాయపడ్డాడు. ఇంతకుముందు సారథులుగా ఉన్న ధోని, కోహ్లీలు మంచి ఫిట్ నెస్ తో ఉండేవారు. గాయాల వల్ల వాళ్లు మ్యాచులకు దూరమైన ఘటనలు అరుదనే చెప్పాలి. కెప్టెన్ గా ఫిట్ గా ఉండి, ప్రతి మ్యాచ్ కు అందుబాటులో ఉంటేనే పటిష్టమైన టీమ్ ను సిద్ధం చేసుకోవడం సులువవుతుంది. అలాగే ఏ ప్లేయర్ తనకు ఇచ్చిన అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్సీ విషయంలో కోహ్లీ అంత దూకుడుగా రోహిత్ వ్యవహరించకపోవచ్చు. కానీ హిట్ మ్యాన్ లో లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నాయనేది విస్పష్టం. సుదీర్ఘ కెరీర్ లో కావాల్సినంత క్రికెట్ ఆడిన రోహిత్ అనుభవం జట్టును గెలుపుబాటలో నడిపించేందుకు దోహదపడుతుందని నమ్ముతున్నా. పూర్తిస్థాయి కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి.. వచ్చే టీ20, వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాలి’ అని రోహిత్ చెప్పాడు.