కోహ్లీ X సీనియర్‌ ప్లేయర్స్‌!

కోహ్లీ X సీనియర్‌ ప్లేయర్స్‌!
  • చెడిన డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌ వాతావరణం
  • సరిచేసేందుకే ధోనీని తీసుకొచ్చిన బీసీసీఐ

న్యూఢిల్లీ: టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్‌‌ కోహ్లీ అనూహ్యంగా తప్పుకోవడానికి గల కారణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌‌ ఓటమి తర్వాత టీమిండియా డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌ వాతావరణం కోహ్లీ వర్సెస్‌‌ సీనియర్‌‌ ప్లేయర్లుగా మారిపోయిందని ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఇది ఇలాగే కొనసాగితే టీ20 వరల్డ్‌‌కప్‌‌పై ప్రభావం చూపిస్తుందని ఆందోళన చెందిన బీసీసీఐ.. పరిస్థితిని చక్కదిద్దేందుకు ధోనీని మెంటార్‌‌గా తీసుకొచ్చిందని పేర్కొంది. డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌లో విభేదాలు రావడానికి కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీయే కారణమని రాసుకొచ్చింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌‌లో బీసీసీఐ వ్యవహరించిన తీరుపై అలిగిన కోహ్లీ.. టీ20 కెప్టెన్సీకి గుడ్‌‌బై చెప్పాడని తెలుస్తోంది. ‘డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన తర్వాత డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌లో అశ్విన్‌‌, పుజారా, రహానెపై కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిగతా వాళ్ల ఆటతీరుపై కూడా కాస్త ఇబ్బందికరంగానే మాట్లాడాడు. దీంతో ఆవేదనకు గురైన ఆ ముగ్గురు.. సెక్రటరీ జై షాకు పర్సనల్‌‌గా ఫోన్‌‌ చేసి అన్ని విషయాలు చెప్పారు. షా ఇతర క్రికెటర్లతో కూడా మాట్లాడగా అందరి వాదన ఒకేలా ఉండటంతో ఇంగ్లండ్‌‌ టూర్‌‌ ఎండ్‌‌లో చర్యలు తీసుకోవాలని బోర్డు డిసైడ్‌‌ అయ్యింది’ అని సదరు పత్రిక పేర్కొంది. దీనికితోడు ఇంగ్లండ్‌‌తో ఆడిన నాలుగు టెస్ట్‌‌ల్లోనూ అశ్విన్‌‌ను ఆడించకుండా కోహ్లీ మరింత ఆజ్యం పోశాడని, దాంతో, టీ20 వరల్డ్​ కప్​నకు టీమ్​ ఎంపికలో కోహ్లీ సూచనలను బోర్డు పెద్దగా పట్టించుకోలేదని చెప్పింది. దీనికి నొచ్చుకున్న విరాట్​ టీ20 కెప్టెన్సీ వదులుకున్నాడని పేర్కొంది.