- రూ.33 కోట్లతో లెప్ట్ మెయిన్ కెనాల్ పనులు పొడిగింపు
- అదనంగా 9 వేల ఎకరాలకు సాగునీరు
- రైట్ మెయిన్ కెనాల్ కింద పెరిగిన డిశార్చ్ కెపాసిటీ
మహబూబ్‌నగర్, వెలుగు : కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద అదనపు ఆయకట్టుకు సాగునీటికి అందించడానికి రాష్ర్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న కెనాల్స్‌ను ఎక్స్టెన్షన్ చేయనుంది. ఈ మేరకు ఫండ్స్రిలీజ్ కావడంతో కొద్ది రోజులుగా ప్రధానమైన లెఫ్ట్ మెయిన్ కెనాల్పనులు ప్రారంభమయ్యాయి.
8 కిలోమీటర్ల మేర పొడిగింపు..
కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద 2004 వరకు కేవలం 12 వేల ఎకరాల ఆయకట్టే ఉండేది. ఆ తర్వాత జూరాల సోర్స్ ఆధారంగా ఈ ప్రాజెక్టు కింద 50,250 ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. ఈ మేరకు కోయిల్ సాగర్ కింద మెయిన్స్ కెనాల్స్, సబ్ కెనాల్స్‌ను డెవలప్ చేస్తూ వస్తున్నారు. అయితే లెఫ్ట్ మెయిన్ కెనాల్పరిధిలో భూ సేకరణ సమస్య రావడంతో పనులు ప్రారంభించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇటీవల భూ సేకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. 135 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. 29 ఎకరాలు పెండింగ్ ఉంది.
106 ఎకరాలకు సంబంధించిన నష్ట పరిహారాన్ని బాధిత రైతులకు అందించారు. దీంతో కొద్ది రోజుల కిందట లెప్ట్ మెయిన్ కెనాల్‌ను పొడిగింపు పనులు ఆఫీసర్లు ప్రారంభించారు. రూ.33 కోట్లతో 8 కిలో మీటర్ల మేర ఈ కెనాల్‌ను పొడిగించనున్నారు. కాలువ పొడిగించడంతో దేవరకద్ర నియోజకవర్గంలోని అప్పంపల్లి, రాజోలి, దాసరిపల్లి, తిర్మలాపూర్, గూడూరు, వెంకంపల్లి, వెంకటగిరి, కౌకుంట్ల, పేరూరు గ్రామాల పరిధిలోని దాదాపు 10 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
రూ.33 కోట్లల్లో రూ.5 కోట్లను భూ సేకరణ కోసం ఖర్చు చేయగా, మిగతా 28 కోట్లల్లో రూ.16 కోట్ల పనులను కంప్లీట్ చేశారు. ప్రస్తుతం 8 కిలో మీటర్ల లెఫ్ట్మెయిన్ కెనాల్ పొడిగింపులో భాగంగా నాలుగు కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఇందులో ముందు భాగం రెండున్నర కిలోమీటర్ల వరకు.. ఎండింగ్లో కిలోమీటరున్నర వరకు బాక్స్ కట్టింగ్ పనులు పూర్తయ్యాయి. కెనాల్ మట్టి జారిపోకుండా స్ర్టక్చర్స్ పనులు చేయాల్సి ఉంది.
లెఫ్ట్ కెనాల్ లైనింగ్ పనులు మొదలు..
లెఫ్ట్మెయిన్కెనాల్కింద దేవరకద్ర నియోజకవర్గానికి సాగునీరు అందుతుంది. ఈకెనాల్ బొల్లారం వద్ద ప్రారంభమై నాగన్నపల్లి, చిన్నరాజమూరు, పెద్ద రాజమూరు, బల్సుపల్లి, బస్వాపూర్, గూరకొండ, దేరవకద్ర, గోపన్‌పల్లి, పుట్టనల్లి మీదుగా సాగుతోంది. అయితే ఏండ్ల కిందటే ఈ కెనాల్ నిర్మాణ పనులు పూర్తి చేసినా.. కాంట్రాక్టర్ లైనింగ్ పనులు పెండింగ్‌లో పెట్టారు. కొద్ది రోజులు కిందట ఈ పెండింగ్ పనులు ప్రారంభించారు.
రైట్కెనాల్ కింద పెరిగిన డిశ్చార్జ్ కెపాసిటీ..
రైట్‌మెయిన్ కెనాల్ కింద 12 కిలో మీటర్ల వరకు లైనింగ్పనులు పూర్తయ్యాయి. దీంతో ఈ కెనాల్పరిధిలో వాటర్ డిశ్చార్జ్ కెపాసిటీని పెంచారు. గతంలో ఈ కెనాల్ ద్వారా రోజుకు 198 క్యూసెక్కుల నీటిని వదిలే సామర్థ్యం మాత్రమే ఉండేది. కెనాల్‌కు లైనింగ్ చేయడంతోపాటు విస్తరించడంతో 410 క్యూసెక్కుల నీటిని తరలించే కెపాసిటీ ఏర్పడింది. కానీ.. ప్రస్తుతం దాదాపు 390 క్యూసెక్కుల నీటిని ఈ కెనాల్ ద్వారా విడుదల చేస్తున్నారు. అయితే ఈ కెనాల్ కింద ప్రధానమైన లింక్ కెనాల్ పనులు చేయాల్సి ఉంది. ఈ లింక్ కెనాల్ కంప్లీట్ చేస్తే నారాయణపేట, మహబూబ్‌నగర్‌జిల్లాల్లో దాదాపు 20 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
