రసెల్‌ హల్‌చల్‌.. కేకేఆర్ విజయం

రసెల్‌ హల్‌చల్‌.. కేకేఆర్ విజయం

ముంబై:  కొత్త సీజన్‌‌లో కరీబియన్‌‌ హిట్టర్‌‌, కోల్‌‌కతా నైట్‌‌ రైడర్స్‌‌ ఆండ్రీ రసెల్‌‌ (31 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 70 నాటౌట్‌‌) ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించాడు. తమ రెండో మ్యాచ్‌‌లోనే ఖతర్నాక్‌‌ ఆటతో హల్‌‌చల్‌‌ చేశాడు.  టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో కేకేఆర్‌‌51/4తో కష్టాల్లో పడ్డ టైమ్‌‌లో స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఎలాంటి బాల్‌‌ వచ్చినా తన బ్యాట్‌‌ పవర్‌‌తో స్టాండ్స్‌‌కు చేర్చి ఫ్యాన్స్‌‌కు కిక్‌‌ ఇచ్చాడు.  తొలుత బౌలింగ్‌‌లో  ఉమేశ్‌‌ యాదవ్‌‌ (4–1–23–4) కూడా  విజృంభించడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌లో  కేకేఆర్‌‌ ఆరు వికెట్ల తేడాతో  పంజాబ్‌‌ కింగ్స్‌‌ను చిత్తు చేసి సీజన్‌‌లో రెండో విజయం సొంతం చేసుకుంది.   లో స్కోరింగ్‌‌ మ్యాచ్‌‌లో తొలుత ఉమేశ్‌‌ దెబ్బకు పంజాబ్‌‌   19.2 ఓవర్లలో 137  రన్స్‌‌కే ఆలౌటైంది. భానుక రాజపక్స (9 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 31), కగిసో రబాడ (16 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 25) టాప్‌‌ స్కోరర్లు. ఉమేశ్‌‌తో పాటు టిమ్‌‌ సౌథీ (2/36)  సత్తా చాటాడు. ఛేజింగ్‌‌లో రసెల్‌‌ రెచ్చిపోవడంతో కోల్‌‌కతా 14.3 ఓవర్లలోనే 141/4 స్కోరు  చేసి ఈజీగా గెలిచింది. రసెల్‌‌తో పాటు కెప్టెన్ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (26), సామ్‌‌ బిల్లింగ్స్‌‌ (24 నాటౌట్‌‌) రాణించారు.  రసెల్‌‌కే ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. 
 

టాప్‌‌ తడబాటు.. రసెల్‌‌ దాడి
చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో  కోల్‌‌కతాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలినా రసెల్‌‌ పవర్‌‌ హిట్టింగ్‌‌తో సులువుగా గెలిచింది.  మొదట్లో మాత్రం పంజాబ్‌‌ బౌలర్లు కేకేఆర్‌‌ను కంగారుపెట్టారు. మూడు ఫోర్లతో ఊపు మీద కనిపించిన ఓపెనర్‌‌ అజింక్యా రహానె (12)ను  రబాడ (1/23) మూడో ఓవర్లోనే పెవిలియన్‌‌ చేర్చాడు. ఇంకో ఓపెనర్‌‌ వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ (3) మరోసారి నిరాశ పరిచాడు. మరో ఎండ్‌‌లో కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌, బిల్లింగ్స్‌‌  నిలకడగా ఆడటంతో పవర్‌‌ ప్లేలో కేకేఆర్‌‌ 51/2తో నిలిచింది. కానీ, తర్వాతి ఓవర్‌‌ను మెయిడెన్‌‌ చేసిన స్పిన్నర్‌‌ రాహుల్‌‌ చహర్‌‌ (2/13).. శ్రేయస్‌‌తో పాటు నితీశ్‌‌ రాణా (0)ను ఔట్ చేసి కోల్‌‌కతాకు షాకిచ్చాడు. తర్వాతి రెండు ఓవర్లలో ఐదు రన్సే రావడంతో 59/4తో నిలిచిన కేకేఆర్‌‌ కష్టాల్లో పడింది. పంజాబ్‌‌ బౌలర్ల జోరు చూస్తే విజయం కోసం కోల్‌‌కతా చివరిదాకా పోరాడేలా కనిపించింది. అయితే తొలి ఏడు బాల్స్‌‌లో  రెండే రన్స్‌‌ చేసిన ఆండ్రీ రసెల్‌‌ ఒక్కసారి గేర్‌‌ మార్చాడు. హర్‌‌ప్రీత్‌‌ బ్రార్‌‌ (0/20)  వేసిన పదో ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో కోల్‌‌కతాను తిరిగి రేసులోకి తేచ్చాడు. ఆపై స్మిత్‌‌ బౌలింగ్‌‌లో రసెల్‌‌ కండ్లు చెదిరే షాట్లతో  4, 6, 6, 6 బాదగా.. బిల్లింగ్స్‌‌ ఓ సిక్స్‌‌ కొట్టాడు. ఈ ఒక్క ఓవర్లోనే 30 రన్స్‌‌ రావడంతో కేకేఆర్‌‌ స్కోరు 100 దాటి మ్యాచ్‌‌ వన్‌‌సైడ్‌‌ అయిపోయింది. అదే స్పీడు కొనసాగించిన ఆండ్రీ.. లివింగ్‌‌స్టోన్‌‌ (0/13) బౌలింగ్‌‌లో  వరుసగా రెండు సిక్సర్లతో మరో ఐదు ఓవర్లు మిగిలుండగానే కేకేఆర్​ను గెలిపించాడు. 

పంజాబ్‌‌ పడుతూ లేస్తూ.. 
టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన పంజాబ్‌‌ ఇన్నింగ్స్‌‌ పడుతూ లేస్తూ సాగింది.  పవర్‌‌ ప్లేలో మెరుపులు మెరిపించినప్పటికీ.. మిడిల్‌‌ ఓవర్లలో డీలా పడి తక్కువ స్కోరుకే పరిమితమైంది. సీనియర్‌‌ బౌలర్‌‌ ఉమేశ్‌‌ యాదవ్‌‌ తొలి ఓవర్లోనే పంజాబ్‌‌ కెప్టెన్‌‌ మయాంక్‌‌ అగర్వాల్‌‌ (1) ఎల్బీగా వెనక్కిపంపాడు. అయితే తొలి బాల్​నే బౌండ్రీ చేర్చిన భానుక రాజపక్స కొద్దిసేపే క్రీజులో ఉన్నా.. భారీ షాట్లతో రెచ్చిపోయాడు.   ఉమేశ్‌‌ వేసిన మూడో ఓవర్లో తను మరో ఫోర్​ కొట్టగా.. ధవన్‌‌ (16) బౌలర్‌‌ తలమీదుగా సిక్స్‌‌ బాదాడు. ఇక, శివం మావి వేసిన తర్వాతి ఓవర్లో భానుక వరుసగా 4, 6, 6, 6తో స్టేడియాన్ని హోరెత్తించాడు. మరో షాట్‌‌ కొట్టే ప్రయత్నలో మిడాఫ్‌‌లో టిమ్‌‌ సౌథీకి క్యాచ్‌‌ ఇవ్వడంతో కోల్‌‌కతా ఊపిరిపీల్చుకుంది. సౌథీ వేసిన ఆరో ఓవర్లో లివింగ్‌‌ స్టోన్‌‌ (19) సిక్స్‌‌, ధవన్‌‌ ఫోర్‌‌ కొట్టి స్కోరు దాటించాడు. కానీ, అదే ఓవర్లో ఆఫ్‌‌ కట్టర్‌‌తో ధవన్‌‌ను కాట్‌‌ బిహైండ్‌‌ చేసిన సౌథీ ప్రతీకారం తీర్చుకున్నాడు. పవర్‌‌ ప్లేలో పంజాబ్‌‌ 62/3 స్కోరు సాధించింది. స్పిన్నర్లు చక్రవర్తి (0/14), నరైన్‌‌ (1/23) రాకతో ఆ టీమ్‌‌ స్కోరుకు కళ్లెం పడింది. మరో వైపు క్రీజులో కుదురుకున్న లివింగ్‌‌స్టోన్‌‌ను ఉమేశ్​ పెవిలియన్‌‌ చేర్చగా.. రాజ్‌‌బవా (11)ను నరైన్​ బౌల్డ్‌‌ చేయడంతో  సగం ఓవర్లకు పంజాబ్‌‌ 85/5తో డీలా పడ్డది. హిట్టర్‌‌ షారుక్‌‌ ఖాన్‌‌ (0) డకౌటవగా.. 15వ ఓవర్‌‌ను మెయిడిన్​ చేసిన ఉమేశ్​ హర్‌‌ప్రీత్‌‌ (14), రాహుల్‌‌ చహర్‌‌ (0)ను ఔట్‌‌ చేయడంతో 102/8తో నిలిచిన పంజాబ్‌‌ 120 చేస్తే గొప్పే అనిపించింది. ఈ దశలో టెయిలెండర్‌‌ రబాడ అనూహ్యంగా బ్యాట్‌‌ ఝుళిపించాడు. సౌథీ వేసిన 17వ ఓవర్లో వరుసగా 4, 4, 6 బాదాడు. ఆపై మావి బౌలింగ్‌‌లో తను రెండు ఫోర్లు కొట్టగా.. ఒడియన్‌‌ (9 నాటౌట్​) సిక్స్‌‌ బాదడంతో స్కోరు 130 దాటింది. కానీ, 19వ ఓవర్లో  రసెల్‌‌ తొలి బాల్‌‌కే రబాడను ఔట్‌‌ చేయగా.. రెండో బాల్‌‌కు అర్షదీప్‌‌ (0) రనౌటవడంతో పంజాబ్‌‌ ఇన్నింగ్స్‌‌ ముగిసింది.