కోల్‌‌‌‌కథ ముగిసింది.. ఆర్సీబీతో కేకేఆర్ మ్యాచ్ వర్షార్పణం

కోల్‌‌‌‌కథ ముగిసింది.. ఆర్సీబీతో కేకేఆర్ మ్యాచ్ వర్షార్పణం

బెంగళూరు: అనూహ్యంగా వచ్చిన ఎనిమిది రోజుల విరామం తర్వాత మళ్లీ మొదలైన ఐపీఎల్‌‌‌‌ను వాన వెంటాడింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని ఆశించిన డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ కోల్‌‌‌‌కతా నైట్ రైడర్స్‌‌‌‌ ఆశలపై నీళ్లు కుమ్మరించింది. శనివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరు (ఆర్సీబీ), కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌‌‌‌ భారీ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దయింది. 

దాంతో ఇరు జట్లకూ చెరో పాయింట్ కేటాయించగా.. 13 మ్యాచ్‌‌‌‌ల్లో 12 పాయింట్లతో ఆరో ప్లేస్‌‌‌‌లో ఉన్న కేకేఆర్‌‌‌‌‌‌‌‌ ప్లేఆఫ్స్‌‌‌‌ రేసు నుంచి వైదొలిగింది. ఇప్పటికే సీఎస్కే, సన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌, రాజస్తాన్‌‌‌‌ నాకౌట్ పోటీ నుంచి తప్పుకోగా.. కేకేఆర్‌‌‌‌‌‌‌‌ కూడా ఆ లిస్ట్‌‌‌‌లో చేరింది. 12 మ్యాచ్‌‌‌‌ల్లో 17 పాయింట్లతో టాప్ ప్లేస్‌‌‌‌లోకి వచ్చిన ఆర్సీబీ ప్లేఆఫ్స్‌‌‌‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. 

అయితే, ఈ మ్యాచ్ రద్దవడంతో బెంగళూరు టాప్‌‌‌‌–2లో నిలిచి క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌1 ఆడే అవకాశాలపై ప్రభావం పడొచ్చు. ఆర్సీబీ ఇదే స్టేడియంలో 23న జరిగే తమ తర్వాతి మ్యాచ్‌‌‌‌లో సన్ రైజర్స్‌‌‌‌తో పోటీ పడనుంది. కేకేఆర్ 25న ఢిల్లీలో జరిగే తమ చివరి పోరులో
హైదరాబాద్‌‌‌‌నే ఎదుర్కోనుంది.

కోహ్లీ ఫ్యాన్స్‌‌‌‌కు నిరాశ

టెస్టు ఫార్మాట్‌‌‌‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ ఆడుతున్న తొలి మ్యాచ్‌‌‌‌ కావడంతో అతని ఫ్యాన్స్‌‌‌‌ భారీ సంఖ్యలో వచ్చారు. సాయంత్రం నుంచే వాన పడుతున్నా లెక్క చేయకుండా స్టేడియానికి పోటెత్తారు. సాధారణంగా ఆర్సీబీ ఫ్లాగ్స్, జెర్సీలతో ఎర్రగా కనిపించే చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్‌‌‌‌ విరాట్ టెస్టు వైట్‌‌‌‌ జెర్సీలతో సందడి చేశారు. 

‘థ్యాంక్యూ విరాట్‌‌‌‌’ అనే బ్యానర్లు ప్రదర్శించారు. నాలుగు గంటల పాటు వాన నిలకడగా కురుస్తున్నప్పటికీ స్టేడియంలోనే ఉండిపోయిన ఫ్యాన్స్‌‌‌‌.. కోహ్లీ కోహ్లీ అని నినాదాలు చేశారు. మైదానం నీటి మడుగును తలపించడంతో  కోహ్లీ సహా ప్లేయర్లెవ్వరూ  గ్రౌండ్‌‌‌‌లోకి కూడా రాలేకపోయారు. చివరకు రాత్రి 10.20 గంటల సమయంలో గ్రౌండ్‌‌‌‌ను పరిశీలించిన అధికారులు మ్యాచ్‌‌‌‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.