కొల్లాపూర్, వెలుగు : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి మండలంలో ఏకంగా 139 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో ఎండిపోయిన పంటలు, బోర్ల నేపథ్యంలో ఈ వర్షం రైతన్నలకు ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. భూగర్భ జలాలు పెరుగుతాయని వారు భావిస్తున్నారు.
కాగా, కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని గిరిజన హాస్టల్‌లోకి భారీగా వర్షపు నీరు చేరి నిండుకుండలా మారడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. స్థానికంగా ఈదమ్మ రోడ్డు సమీపంలోని మల్లపు రాజు కుంట అలుగు ఉధృతి పెరగడంతో పాటు నార్లాపూర్, ముక్కిడిగుండం మధ్య వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వాగులో ఆందోళన నిర్వహించారు.
