అమిత్​షాను విడివిడిగా కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్​

అమిత్​షాను విడివిడిగా కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్​
  • దాసోజు శ్రవణ్​ రాజీనామా
  • అమిత్​షాను విడివిడిగా కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్​
  • నన్ను వెళ్లగొట్టాలని చూస్తున్నరు: వెంకట్​రెడ్డి
  • రేవంత్​రెడ్డి ముఖం కూడా చూడనని కామెంట్​
  • మునుగోడు సభకు దూరం


హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. రెండు రోజుల కిందట మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తాజాగా ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​కుమార్.. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. మునుగోడులో మనోధైర్యసభ ఉన్న రోజే ఆయన రాజీనామా చేయడం కాంగ్రెస్‌‌ను షాక్‌‌కు గురి చేసింది. వరుసగా చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాలతో పార్టీలో గందరగోళం నెలకొంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తితోనే పార్టీని వీడుతున్నట్లు శ్రవణ్ ప్రకటించారు. మరోవైపు రాజగోపాల్​రెడ్డి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 21న బీజేపీ కండువా కప్పుకోనున్నారు. శ్రవణ్ కూడా ఆయన బాటలోనే త్వరలో బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్నది. రేవంత్​రెడ్డి విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి.. మునుగోడులో శుక్రవారం పార్టీ ఏర్పాటు చేసిన మనోధైర్య సభకు దూరంగా ఉన్నారు. కానీ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్​షాను కలవడం కలకలం రేపింది. అయితే తాను రాష్ట్రానికి వరద సాయం విడుదల చేయాలని కోరేందుకే అమిత్​షాను కలిశానని వెంకట్‌‌రెడ్డి తర్వాత వెల్లడించారు. వరంగల్‌‌లో రాహుల్ సభ తర్వాత ఒకరిద్దరు లీడర్ల చేరికలతో కాంగ్రెస్ కొంత ఉత్సాహంలో కనిపించింది. ఇప్పుడు ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతుండటంతో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయోనని పార్టీ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు పార్టీలో చేరిన వారి కన్నా.. వెళ్లిపోతున్న నాయకులే ఎక్కువ పేరున్న, ప్రభావం చూపగల వాళ్లు కావడం కూడా కాంగ్రెస్‌‌లో చర్చకు తావిస్తున్నది. 

తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారి పోతున్నది. ఇటీవల వరంగల్‌‌లో నిర్వహించిన రైతు గర్జన సభ తర్వాత పార్టీలో చేరికలతో కొంత ఉత్సాహం కనిపించినట్లయింది. టీఆర్ఎస్ నేత నల్లాల ఓదెలు, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డితోపాటు పలు జిల్లాలకు చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి కాంగ్రెస్‌‌ కండువా కప్పుకున్నారు. అయితే ఈ ఉత్సాహం ఎక్కువ కాలం నిలువలేదు. కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. తమకు తెలియకుండానే పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని ఆయా ప్రాంతాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా చెరుకు సుధాకర్‌‌‌‌ను కాంగ్రెస్‌‌లో చేర్చుకోవడం జిల్లా నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి అయితే ‘రేవంత్ పెద్ద తప్పు చేశారు’ అంటూ విమర్శించారు. మరోవైపు పార్టీ పని తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేతలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపైనా లీడర్లు నొచ్చుకుంటున్నారు. గిట్టని వాళ్లను టార్గెట్ చేసి పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపిస్తున్నారు. ఏండ్ల తరబడి ఎంతో కష్టపడి పని చేసినా ఏమాత్రం గుర్తింపు లేకుండా చేస్తున్నారనే ఆవేదన పలువురి నేతల మాటల్లో వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గొంతుకగా పేరు తెచ్చుకున్న దాసోజు శ్రవణ్.. పార్టీని వీడటం మరింత చర్చకు దారి తీసింది.

ఎవరికి చెప్పుకోవాలో తెలియక

చాలా మంది సీనియర్లు దశాబ్దాలుగా కాంగ్రెస్‌‌లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కొందరు నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. జగ్గారెడ్డి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలు విమర్శలు వేస్తూనే ఉన్నారు. మూడు నెలల కిందట కాంగ్రెస్ లాయలిస్టుల పేరుతో కొందరు ముఖ్యనేతలు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో భేటీ అయ్యి పార్టీ నడుస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐసీసీకి నివేదిక కూడా పంపారు. వీళ్లు కాక ఇతర నేతలు విడివిడిగా అధిష్టానానికి రిపోర్టులు, లేఖలు పంపుతూనే ఉన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను చూసి రాహుల్ గాంధీ ముఖ్య నేతలను పిలిపించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అయినా పార్టీ పని తీరులో మార్పు లేకపోవడం పట్ల నేతలు నిరాశకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్‌‌ వద్ద కూడా చాలా మంది తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఫలితం కనిపించకపోవడంతో కొందరు సైలెంట్ అయ్యారు. మరికొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.

21న బీజేపీలోకి రాజగోపాల్ 

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి  ఈ నెల 21న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో కలిసి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన భేటీలో పార్టీలో చేరిక, రాష్ట్రంలోని ఇతర అంశాలపై చర్చించారు.

నారాజ్​లో కాంగ్రెస్​ కార్యకర్తలు

ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయన్న చర్చ రాష్ట్రంలో జరుగుతున్నది. ప్రత్యేక తెలంగాణను తన హయాంలోనే ఇచ్చిన కాంగ్రెస్.. రాష్ట్రంలో అధికారాన్ని మాత్రం దక్కించుకోలేక పోయింది. రెండు పర్యాయాలు పవర్‌‌‌‌కు దూరంగానే ఉండాల్సి వచ్చింది. ఈ ఎనిమిదేండ్లలో కేసీఆర్ సర్కార్‌‌‌‌పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని కాంగ్రెస్​ నేతలు చెప్పుకుంటున్నారు. కష్టపడితే అధికారం ఖాయమని భావిస్తున్న టైమ్‌‌లోనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంపై కార్యకర్తలు నారాజ్​కు గురవుతున్నారు. కలిసికట్టుగా పోరాడాల్సిన టైమ్​లో ఇలా విభేదాలతో రచ్చకెక్కడంపై ఆవేదన చెందుతున్నారు.