మునుగోడు ఉపఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ పతనం స్టార్ట్

మునుగోడు ఉపఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ పతనం స్టార్ట్

మునుగోడు ఉపఎన్నికలో ఓటు వేసేటప్పుడు ప్రతి కార్యకర్తకు కారు గుర్తు, కేసీఆర్ తప్ప ఇంకేమీ కనపడొద్దని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి గురించి కేసీఆర్ చూసుకుంటాడని.. తెలంగాణనే తెచ్చిన వ్యక్తికి అభ్యర్థిని ఎవరిని పెట్టాలో మనం చెప్పాల్నా అని అన్నారు. సంస్థాన్ నారాయణపురంలో మంత్రి సమక్షంలో కాంగ్రెస్ ఎంపీటీసీ టీఆర్ఎస్ లో చేరారు. రాజగోపాల్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ సభ్యత్వం ఉందా అని ఆయన ప్రశ్నించారు.

నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ రౌడీయిజంతో రాజకీయం చేశారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందన్న రాజగోపాల్రెడ్డి.. వారు చేసేది ఏం రాజకీయం అని నిలదీశారు. రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనలేదన్నారు. మునుగోడు ఉపఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ పతనం మొదలవుతుందని విమర్శించారు.  

టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు

టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. తెలంగాణభవన్ లో మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు గుర్రం సత్యం, కుంట్లగూడెం సర్పంచ్ పారిజాతంగోపాల్, కిష్టపురం సర్పంచ్ రాధారమేష్ సహా పలువురు టీఆర్ఎస్లో చేరారు. కాగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని మధుసూదనాచారి, జీవన్ రెడ్డి తెలిపారు.