
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ కారుకు డ్రైవర్ లేడని.. పోయి ఫాంహౌస్‌లో పడుకున్నడని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి విమర్శించారు. ‘‘పార్టీ ఆఫీసులకు పోయేందుకు.. పోరుబాట చేసేందుకు కాలు నొప్పి లేదు. కానీ.. ప్రజా సమస్యలపై మాట్లాడేం దుకు మాత్రం ఆయన రారు. అంటే.. మీ కారుకు డ్రైవర్ లేడా? డ్రైవర్ లేని కారా మీది? అది రిపేర్‌కు పోయిన కారు కాదు.. గ్యారేజీకి పోయిన కారు.. మీ పార్టీకి లీడర్ లేడు. మేం సభలో ఎవరితో మాట్లాడాలి?’’ అని బీఆర్ఎస్ సభ్యులనుద్దేశించి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల విషయంలో ఏ పార్టీని అయినా పిలిచి మాట్లాడారా? మాకు తెలివి లేదన్నరు. కాళేశ్వరం ఎందుకు కూలినట్టు మరి? కృష్ణా వాటర్ ఎందుకు దోపిడీకి గురవుతున్నది? మీరు ఇటు (అధికారం) నుంచి అటు (ప్రతిపక్షంలోకి) ఎందుకు పోయిన్రో అర్థమైతలేదా?’’అని ఆయన ప్రశ్నించారు.
మా మాటలు బుల్లెట్ల లెక్క తగులుతున్నయ్
రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు పూర్తయ్యేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రైతుల భూములు అగ్గువకు గుంజుకుని వాళ్లని రోడ్డుపై నిలబెట్టారని మండిపడ్డారు. ‘‘మేము మాట్లాడుతున్న మాటలు కొందరికి బుల్లెట్ల లెక్క తగులుతున్నయ్. వాళ్లకు తూటాలు తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. పదేండ్లలో ప్రాజెక్ట్‌లకు పర్మిషన్లు సాధించలేకపోయిన్రు. మీలాగా మేము ఎవరికీ భయపడం. రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడుతాం. పర్మిషన్ లేని ప్రాజెక్ట్ కోసం వేల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసిన్రు’’అని బీఆర్ఎస్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతలు పూర్తి చేద్దామన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్కు లేకుండా పోయిందని విమర్శించారు.
పదేండ్లు నియంతలా పని చేసిన్రు
బీఆర్ఎస్ సర్కార్ పదేండ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అందుకే ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ‘‘నల్గొండను కేసీఆర్ పట్టించుకోలేదు. ఆయనకు ఎప్పుడూ సీఎం కుర్చీనే కావాల్నా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు ఏ పని చేయరా? ఫామ్ హౌస్ కోసమే కొండ పోచమ్మ రిజర్వాయర్ కట్టుకున్నడు. నియంతలా పని చేసిండు. కేసీఆర్, హరీశ్, జగదీశ్ రెడ్డి కలిసి నల్గొండ జిల్లాను ముంచేసిన్రు. మేము రాజకీయాలు చేయడం లేదు’’అని అన్నారు. హరీశ్ బాగా కష్టపడుతున్నారని, తాము చేసే అభివృద్ధిని కండ్లు తెరిచి చూడాలని కోరారు. ఉత్తమ్ ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత రెండు నెలలుగా నిద్ర లేకుండా పని చేస్తున్నారన్నారు.
హరీశ్..రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ
26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్‌లోకి తీసుకొస్తే హరీశ్ రావుకు మంత్రి పదవి ఇస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ‘రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ’ అంటూ హరీశ్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. ‘‘పార్టీ కోసం హరీశ్ ఎంతో కష్టపడుతున్నడు. అది లాభం లేని కష్టం.. బీఆర్ఎస్లో ఉంటే హరీశ్‌కు ఫ్యూచర్ లేదు. కాంగ్రెస్‌లోకి వస్తే మినిస్ట్రీ ఇస్తాం. ఇరిగేషన్ ఇవ్వం.. దేవాదాయ శాఖ ఇస్తం.. ఎందుకంటే గత పదేండ్లలో చేసిన పాపాలు అన్ని కడుక్కోవాలి కదా.. మా పార్టీని గతంలో విలీనం చేసుకున్నారు కదా.. మేమూ అదే చేస్తాం’’అని అన్నారు. సోమవారం అసెంబ్లీ ముగిసిన తర్వాత లాబీలో రాజ్‌గోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘నాకు మంత్రి పదవి రాదని బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడ్తున్నరు. రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి డిస్ట్రర్బ్ చేస్తున్నరు. ఇలాంటి చీప్ పాలిటిక్స్ మానుకోవాలి. కడియం శ్రీహరి, హరీశ్ రావులా నేను జీ హుజూర్.. అనే వ్యక్తిని కాదు. ఎమ్మెల్యే, మంత్రి పదవులు త్యాగం చేసిన కుటుంబం మాది’’అని ఆయన అన్నారు.
ఊళ్లు తిరుగుతూ డబ్బులు పంచుతున్నడు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాము మరిం త బలపడ్డామని రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్గొండ బీఆర్ఎస్ పోరుబాట మీటింగ్‌కు 60వేల మంది కంటే ఎక్కువ రారని అన్నారు. దీంతో ఊళ్లు తిరుగుతూ జగదీశ్ రెడ్డి డబ్బులు పంచుతున్నాడని ఆయన ఆరోపించారు.