మునుగోడులో రాజగోపాల్ రెడ్డి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం : బండి సంజయ్

మునుగోడులో రాజగోపాల్ రెడ్డి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం : బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ నేతల టీమ్ వర్క్ భేష్ అని.. పార్టీ గెలుపు కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నా.. అధికారాన్ని ఉపయోగించి అక్రమ పద్ధతుల్లో గెలిచారని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం బీజేపీ స్టేట్ ఆఫీసులో మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై పార్టీ స్టేట్​చీఫ్ బండి సంజయ్ అధ్యక్షతన ఎన్నికల ఇన్​చార్జ్ లు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన పోరాటంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ​నేతలు అన్ని అడ్డదారులు తొక్కి గెలిచారని, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరుగుతోందని ఈ సందర్భంగా సంజయ్​ అన్నారు.

ఎవరికి అప్పగించిన బాధ్యతను వారు  విజయవంతంగా పూర్తి చేశారని పార్టీ ఇన్​చార్జ్ లను అభినందించారు. ఉప ఎన్నికలో గెలుపోటములు సహజం.. కానీ గెలుపు కోసం చేసిన పోరాటమే స్ఫూర్తిదాయకమని, అందుకే రాజగోపాల్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సంజయ్ అన్నారు. బీజేపీ గెలవాలనే తపన ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలో కనిపించిందని, అందరూ ఎంతో కష్టపడి పనిచేశారని తెలిపారు. టీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఈ ఎన్నికతో నిరూపించామన్నారు. మునుగోడులో గెలిచేందుకు సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేశారని చెప్పారు.

అడ్డదారుల్లో గెలిచారు: రాజగోపాల్ రెడ్డి

బైపోల్​లో ఓడినందుకు ఏమాత్రం బాధలేదని, నైతికంగా గెలిచామని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో మునుగోడులో బీజేపీకి 12 వేల ఓట్లు వస్తే.. ఇప్పుడు 86 వేల ఓట్లు సాధించగలిగామని, ఇది పార్టీ బలోపేతానికి నిదర్శనమన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ.. ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అన్ని అనైతిక చర్యలకు పాల్పడి గెలిచారని ఆరోపించారు. గెలుపు కోసం కేసీఆర్ చివరకు కమ్యూనిస్టుల కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా 150 మంది టీఆర్ఎస్ ముఖ్య  ప్రజా ప్రతినిధులు మనుగోడులోనే మకాం వేసి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు థాంక్స్ చెప్పారు. స్వచ్ఛందంగా మునుగోడుకు వచ్చి బీజేపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి నాయకుడికి, కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, విజయశాంతి, మాజీ ఎంపీ  బూర నర్సయ్య గౌడ్, ప్రేమేందర్ రెడ్డి, బాబూ మోహన్, బంగారు శృతి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వివేక్‌‌ వెంకటస్వామికి అభినందనలు

మునుగోడు ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివెక్ వెంకటస్వామిని ఈ సమావేశంలో బండి సంజయ్‌‌, ఇతర నేతలు ప్రత్యేకంగా అభినందించారు. స్టీరింగ్ కమిటీ చైర్మన్‌‌గా నియమించినప్పటి నుంచి మునుగోడులోనే ఉంటూ పార్టీ కార్యకర్తలను, నాయకులను వివేక్ సమన్వయపర్చారని.. రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీతో సంప్రదింపులు జరుపుతూ, పార్టీ వ్యూహాలు అమలయ్యేలా ఆయన కృషి చేశారని పేర్కొన్నారు.

సంజయ్​ని కలిసిన రాజాసింగ్ భార్య

పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురై, పీడీ యాక్టు కింద జైలులో ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాబాయీ సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్​ను కలిశారు. రాజా సింగ్​పై పార్టీ విధించిన సస్పెన్షన్​ను ఎత్తివేయాలని కోరారు. అయితే రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరుతూ జాతీయ నాయకత్వానికి సంజయ్ లేఖ రాసినట్లు సమాచారం. పార్టీపరంగా న్యాయ సహాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మోడీ సభ సక్సెస్​పై సంజయ్ సమావేశం

ఈ నెల 12న రామగుండం ఎరువుల కర్మాగారం రీఓపెనింగ్ కోసం వస్తున్న ప్రధానికి ఘన స్వాగతం పలకడం, సభకు జన సమీకరణ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా నేతలతో సంజయ్ సమావేశమయ్యారు. పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించేందుకు ఇప్పటి నుంచే ట్రాన్స్‌‌పోర్టు ప్లాన్ రెడీ చేసుకోవాలని సూచించారు.