ప్రజల ఆత్మగౌరవం  కాపాడేందుకే పదవికి రిజైన్ : కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి

ప్రజల ఆత్మగౌరవం  కాపాడేందుకే పదవికి రిజైన్ : కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి
  • ధర్మానికి, అధర్మానికి నడుమ యుద్ధం
  • మునుగోడు బైపోల్ తర్వాత కేసీఆర్​ గద్దె దిగుడు ఖాయం
  • వీ6 వెలుగు ఇంటర్వ్యూలో  కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి
  • అసెంబ్లీ సాక్షిగా మునుగోడుకు ఫండ్స్ ​ఇవ్వాలని ఎన్నో సార్లు పోరాడిన
  • నియోజకవర్గంపై కక్ష కట్టి.. అభివృద్ధికి పైసా ఇయ్యలే
  • ప్రజల ఆత్మగౌరవం  కాపాడేందుకే పదవికి రిజైన్
  • రాజకీయంగా ఎదుర్కోలేకే బీజేపీకి అమ్ముడుపోయానని ఆరోపిస్తున్నరు
  • టీఆర్ఎస్‌‌లో కాంట్రాక్టర్లు లేరా? పువ్వాడ, గంగుల వ్యాపారాలు చేయరా?
  • కేసీఆర్ లెక్క ప్రజల సొమ్ము దోచుకోలేదని కామెంట్

నల్గొండ, వెలుగు: మునుగుడు ఉప ఎన్నిక.. పార్టీల మధ్య జరిగే పోరు కాదని, ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమని బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్​రెడ్డి అన్నారు. ఈ యుద్ధంలో టీఆర్​ఎస్​ ఓటమి తర్వాత కేసీఆర్ గద్దె దిగుడు ఖాయమని చెప్పారు. మునుగోడు ప్రజల తరఫున నిలబడ్డ తనను అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్​ ఎన్నోసార్లు అవమానించారని, ఫండ్స్ ఇవ్వకుండా నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకే తాను రాజీనామా చేశానని, దీంతో ఫామ్‌‌హౌస్‌‌లో పడుకున్న సీఎం కేసీఆర్, 15 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు దిగివచ్చి మునుగోడు ప్రజల ముందు మోకరిల్లారని చెప్పారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే బీజేపీకి అమ్ముడుపోయానని ఆరోపిస్తున్నారని, దమ్ముంటే రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుకు ఆధారాలు​చూపాలని అడిగినా స్పందన లేదన్నారు. బైపోల్ తర్వాత టీఆర్ఎస్ సర్కారు కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ‘ వీ6 వెలుగు’కు రాజగోపాల్​రెడ్డి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

అపాయింట్‌‌మెంట్ కూడా ఇవ్వలే

మునుగోడు ప్రజలు అపొజిషన్​ పార్టీకి చెందిన నన్ను గెలిపించారనే ఒకే ఒక్క కారణంతో కేసీఆర్​ మాపై కక్ష కట్టిండు. నియోజకవర్గ అభివృద్ధికి నయా పైసా ఇవ్వలేదు. అదే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌‌కు వేల కోట్లు తీసుకపోయిండు. ఇదే విషయం మాట్లాడాలని అపాయింట్‌‌మెంట్ అడిగితే ఇవ్వలేదు. ఇది నాకు జరిగిన అవమానం కాదు. మునుగోడు ప్రజలకు జరిగిన అవమానం. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసం ఒక్క పని కూడా చేయలేకపోయానని ఎంతో ఆవేదన చెందాను. మూడున్నరేండ్ల పాటు అసెంబ్లీ సాక్షిగా మునుగోడుకు ఫండ్స్ ​ఇవ్వాలని ఎన్నో సార్లు పోరాడాను. కానీ సర్కారు ఏనాడూ పాజిటివ్​గా స్పందించలేదు. 

హుజూర్​నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ బయటికి వచ్చి వందల కోట్ల హామీలు, ఫండ్స్ ఇచ్చాడు. ఉప ఎన్నిక వస్తే తప్ప కేసీఆర్ కదలడని, కండ్లు తెరవడని అర్థమైంది. అందుకే మునుగోడు ప్రజల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. వందకు వందశాతం నేను అనుకున్నట్లే ఇప్పుడు జరుగుతోంది. గట్టుప్పల్ మండలం వచ్చింది. చౌటుప్పల్ నుంచి తగ్గెడపల్లి రోడ్డు వేస్తున్నారు. పది లక్షల మందికి కొత్త పింఛన్లు వచ్చినయ్. గొల్లకుర్మలకు అకౌంట్లలో డబ్బులు వేశారు. భూనిరాస్వితుల ఖాతాల్లోనూ పైసలు పడ్డయి. చేనేత కార్మికులకు బీమా ఇచ్చారు. గిరిజలకు 10 శాతం రిజర్వేషన్లు వచ్చాయి. గిరిజన బంధుపై ప్రకటన వచ్చింది. వీఆర్ఏల సమస్యనూ పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. ఇవన్నీ నా రాజీనామాతోనే సాధ్యమయ్యాయి. ప్రజలకు ఇవన్నీ అర్థమయ్యాయి. అందుకే కేసీఆర్​ను ఓడించేందుకు మునుగోడు ప్రజలు రెడీ అయ్యారు.

ఆరోపణల్లో నిజం లేదు

రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే బీజేపీలో చేరారనే ఆరోపణలపై ఇప్పటికే వందసార్లు సమాధానం చెప్పిన. ‘బీజేపీ నాకు లాభం చేసినట్లు ప్రూఫ్ ఉంటే చూపెట్టండి.. రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అని చెప్పిన. ఆ చాలెంజ్ స్వీకరించాలని కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకే ఇలా అమ్ముడుపోయిండని అభాండాలు వేస్తున్నారు తప్ప అందులో ఎలాంటి నిజం లేదు. అమ్ముడు పోయినట్లు ఆధారాలు ఉంటే చూపించాలి. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి టెంపుల్‌కు కేసీఆర్, కేటీఆర్ వస్తే.. నేనూ వస్తాను. బీజేపీ నుంచి ఎలాంటి లాభం పొందలేదని ప్రమాణం చేస్తాను. వాళ్లిద్దరూ కూడా ప్రమాణం చేయాలి.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించలే

పొలిటీషియన్ న్యాయంగా కాంట్రాక్టులు చేస్తే తప్పేంటి? నా కుటుంబం కోసం చేసుకోవద్దా! టీఆర్ఎస్ పార్టీలో కాంట్రాక్టర్లు లేరా? వ్యాపారాలు చేస్తలేరా? పువ్వాడ అజయ్ వ్యాపారవేత్త కాదా? గంగుల కమలాకర్ కు గ్రానైట్ బిజినెస్ లేదా? న్యాయంగా వ్యాపారాలు చేయడం, కాంట్రాక్టులు చేయడం తప్పు కాదు. రాజకీయాలను అడ్డుపెట్టుకొని కేసీఆర్ లాగా, రేవంత్ రెడ్డిలాగా వేల కోట్లు సంపాదించుకోవడమే తప్పు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే మేము వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకుంటున్నాం. 36 ఏళ్ల నుంచి నిజాయతీగా వ్యాపారం చేసుకుంటున్నాం. కేసీఆర్​లాగా రాజకీయాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోవడం లేదు.  నా వ్యాపారానికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. మునుగోడు ప్రజలకు ఆత్మగౌరవం ఉంది. ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నట్లే.. అదే పోరాట స్పూర్తితో మునుగోడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. వెయ్యి కోట్లు ఇచ్చేందుకు అమిత్​షా హామీ ఇచ్చారు. ఆ నిధులతో రోడ్లు, ఆసుపత్రులు, స్కూల్స్.. ఇలా అన్ని పనులూ చేసుకుంటాం.

చేతికి కాదు.. పువ్వు గుర్తుకే ఓటేస్తరు

ప్రజల గురించి తక్కువ అంచనా వేయవద్దు. చదువు రానోళ్లయినా సరే, తెలివికి తక్కువేమీ లేదు. ఒక వ్యక్తిని గెలిపించేందుకు వెతికి మరీ ఓటేస్తరు. పువ్వు కాదు. పువ్వు చిన్నగపెట్టి, కారు, చెయ్యి పెద్దగా పెట్టినా కమలం గుర్తు ఎక్కడుందని అడిగి మరీ మునుగోడు ప్రజలు ఓటేస్తరు. పువ్వు గుర్తు మీద ఓటేసి రాజగోపాల్ రెడ్డిని గెలిపించేది నాకోసం మాత్రమే కాదు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం.. ఒక నియంత పాలనకు చరమగీతం పాడడం కోసం మునుగోడు ప్రజలు ఎదురుచూస్తున్నరు. ఇది ఆషామాషీ ఎన్నిక కాదు. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న మలి ఉద్యమానికి మునుగోడు నాంది అవుతుంది.

కేసీఆర్‌‌ వణుకుతున్నడు

హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోయాక కేసీఆర్ గ్రాఫ్ చాలా వరకు పడిపోయింది. అందుకే ఈ ఎలక్షన్​ను  ప్రెస్టీజ్​ఇష్యూగా తీసుకుంటాడని నాకు తెలుసు. ఆయన దగ్గర వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము ఉంది. అధికార బలం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్‌‌ను ఎదిరించడం కాంగ్రెస్‌తో సాధ్యం కాదు. కేసీఆర్‌‌ను ఎదుర్కోవాలన్నా, ఆయన నియంత పాలనకు చరమగీతం పాడాలన్నా మోడీ నేతృత్వంలోని బీజేపీతోనే సాధ్యమైతదనే అంచనాకు వచ్చాను. అందులో భాగంగానే బీజేపీలో చేరాను. నేను రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో కేసీఆర్ వెన్నులో వణుకు మొదలైంది. అందుకే 86 మంది ఎమ్మెల్యేలను, 15 మంది మంత్రులను రంగంలోకి దింపాడు. అధికార యంత్రాంగాన్ని, పోలీసులను దగ్గరపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. డబ్బు, మద్యం పంచి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు. మునుగోడు ప్రజలు తెలివైనవాళ్లు. కేసీఆర్​కు బుద్ధిచెప్తారు.

హుజూరాబాద్ తీర్పు రిపీటైతది

బీజేపీ ఓటర్లను నమ్ముకున్నది తప్ప పైసల్ని కాదు. ధర్మం మా వైపు ఉన్నది. మాకు డబ్బులు పంచాల్సిన అవసరం లేదు. ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టేందుకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పనిచేస్తున్నరు. అవినీతి సొమ్ము తీసుకొచ్చి అందరినీ కొంటున్నరు. పార్టీ మారాలంటూ  బెదిరిస్తున్నరు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచుతున్నరు. బట్టకాల్చి మా మీద ఏస్తున్నరు. డబ్బు, మద్యం కంటే ప్రజాశక్తి గొప్పది. ఇదే విషయాన్ని హుజూరాబాద్ ప్రజలు నిరూపించిన్రు. హుజూరాబాద్ తీర్పే మునుగోడు లోనూ రిపీట్ అవుతది.

అన్న మాటల్లో తప్పేముంది?

మునుగోడులో కాంగ్రెస్ ఖతమైపోయిన సంగతి నా అన్న వెంకట్‌రెడ్డికి కూడా అర్థమైంది. మునుగోడులో కేసీఆర్‌‌కు వ్యతిరేకంగా నేను పోరాడుతున్నా. నాకు మంచి పేరు ఉంది. ఆయన తన అభిమానులు ఫోన్ చేసినప్పుడు సపోర్ట్ చేయమని చెప్తే తప్పేముంది? కాంగ్రెస్‌కు పదివేల ఓట్లు కూడా రాలేవు. అలాంటి వాళ్లకు ఎలా సపోర్ట్ చేయమని చెప్తారు. నేను కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌‌కు సపోర్ట్​చేశాను. హుజూరాబాద్‌లో జరిగిందీ, ఇప్పుడు మునుగోడులో జరుగుతున్నది పార్టీల మధ్య పోరు కాదు. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం.. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. 70 ఏళ్ల కింద ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు లేదు. ఇక్కడ 12 మంది ఎమ్మెల్యేలు పోయినంక ఇక్కడా కాంగ్రెస్‌పై ప్రజల ఆలోచన మారింది.

మునుగోడును దత్తత తీసుకోవడానికి కేటీఆర్​ ఎవరు? మునుగోడు ప్రజలేమైనా అనాథలా? ఇక్కడ తెలంగాణ కోసం పోరాటం చేసినవాళ్లే తప్ప అనాథలెవరూ లేరు. కేటీఆర్ నా నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అన్నాడంటేనే టీఆర్ఎస్ తరఫున నిలబెట్టిన క్యాండిడేట్‌‌ డమ్మీ అని అర్థమైతంది. అలాంటి దద్దమ్మను ఎందుకు నిలబెట్టారు? మునుగోడును దత్తత తీసుకోవడం కాదు, ఇక్కడి ప్రజలపై ప్రేమ ఉంటే కేటీఆరే సిరిసిల్లలో రాజీనామా చేసి ఇక్కడ పోటీ చేయాలి’’

‑ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి