తెలంగాణకు ఏదో ఒక రోజు నేను సీఎం అయిత : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

తెలంగాణకు ఏదో ఒక రోజు నేను  సీఎం అయిత :  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నకిరేకల్, వెలుగు: ‘‘ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి నేను సీఎం అవుతా..’’అని భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం.. ఎంపీ కోమటి రెడ్డితో కలిసి శుక్రవారం తొలిసారిగా పట్టణానికి వచ్చారు. దీంతో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి వారికి ఘన స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా నకిరేకల్‌ మెయిన్ సెంటర్‌‌లో జరిగిన సభలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతుండగా, పార్టీ శ్రేణులు, అభిమానులు ‘‘సీఎం.. సీఎం..’’అంటూ నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావొచ్చని, ఏదో ఒక రోజు తాను కూడా సీఎం అవుతానని కోమటి రెడ్డి అన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌ రావు హెలికాప్టర్‌‌లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీపై అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినట్లేనని, నకిరేకల్‌లో మెజారిటీ ఎంత అనేది చూసుకోవాలి అని చెప్పారు. కేసీఆర్‌‌, హరీశ్‌ రావు, కేటీఆర్, జగదీశ్ రెడ్డి నకిరేకల్‌కు వచ్చినా వేముల వీరేశం గెలుపును ఆపలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు విని కేసీఆర్‌‌కు జ్వరం వస్తుందని ఎద్దేవా చేశారు. 

సూర్యాపేటలో పవర్ లేని మంత్రి జగదీశ్‌ రెడ్డి ఉన్నారని, ఈసారి ఆయనకు డిపాజిట్ రాకుండా చేస్తానని చెప్పారు. నకిరేకల్ ఎమ్మెల్యేతో సహా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారందరూ సంతలో పశువుల్లా అమ్ముడుపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటికే అధికార పార్టీ తమ అభ్యర్థులకు రూ.15 కోట్లు ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం దోపిడీ చేస్తున్నదని మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ విమర్శించారు. బీఆర్‌‌ఎస్ నాయకులు బందిపోటుల్లా మారారని ఆరోపించారు. ఆ పార్టీ ఈసారి 25 సీట్లు కూడా గెలవదన్నారు. వేముల వీరేశం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఎంపీ సూచన మేరకే పనిచేస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులకు అండగా ఉంటానన్నారు. తనను పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.