కాళేశ్వరం కేసులో.. కేసీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ కావొచ్చు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాళేశ్వరం కేసులో.. కేసీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ కావొచ్చు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • దేశం విడిచి పారిపోయేందుకు ఆయన ఫ్యామిలీ
  • ఏర్పాట్లు చేసుకుంటున్నది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
  • అందుకే గతంలో హైర్ చేసుకున్న స్పెషల్ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోలె
  • మాజీ సీఎస్​ సోమేశ్ కుమార్ దగ్గర 5 వేల ఎకరాలున్నయ్​
  • అసెంబ్లీ సమావేశాల్లో బండారం బయటపెడతామని ప్రకటన

నల్గొండ, వెలుగు: ‘‘నేనే చీఫ్ ఇంజినీర్ అని చెప్పుకొని కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కుప్పకూలిపోయింది. దానిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏ క్షణమైనా కేసీఆర్ అరెస్ట్ కావచ్చు.. అందుకనే ఇక్కడి నుంచి మూటముల్లె సర్దుకొని కుటుంబంతో సహా దుబాయ్​పారిపోయేందుకు కేసీఆర్​కుటుంబం ఏర్పాట్లు చేసుకుంటున్నది. అందుకే సీఎంగా ఉన్నప్పుడు లీజ్​కు తీసుకున్న స్పెషల్ ఫ్లైట్​ను ఇంకా క్యాన్సిల్ చేసుకోలేదు..’ అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నల్గొండలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్ద వింత అని కేసీఆర్ చెప్పుకున్నారని.. నిజంగానే అది మూడేళ్లలోనే కూలిపోయి వింత అనిపించుకుందని ఎద్దేవా చేశారు.

భువనగిరిలో బీఆర్ఎస్​కు డిపాజిట్ ​రాదు

రెవెన్యూ శాఖతో పాటు కీలకమైన ఇరిగేషన్​, మున్సిపల్, ఆర్థిక​ శాఖలన్నీ తన వద్ద, తన కొడుకు, అల్లుడి వద్ద పెట్టుకొని అంతగా ప్రాధాన్యం లేని శాఖలను తలసాని శ్రీనివాస్, ఇంద్రకరణ్​రెడ్డి లాంటి వారికి అప్పగించారని చెప్పారు. ‘హెచ్​ఏండీఏ డైరెక్టర్​ దగ్గర ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి.. సోమేశ్ కుమార్ పేరు మీద ఐదు వేల ఎకరాలు ఎట్లా ఉంటాయ్.. త్వరలో సోమేశ్ కుమార్ బండారం కూడా బయటవడ్తది’ అని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని, ఒకవేళ డిపాజిట్ వస్తే తన పేరు వెంకట్​రెడ్డే కాదన్నారు. కేసీఆర్ ఈసారి నల్గొండకు వచ్చి మీటింగ్ పెడ్తే జనాలు మళ్లీ ఓట్లతోనే కొడ్తారని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. ‘మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి పులి నిద్ర లేచింది.. త్వరలోనే నల్గొండ వస్తది అంటున్నడు.. పులి లేదు పిల్లి లేదు.. మొత్తం దుకాణం, మూట ముల్లె సర్దుకొని దేశం విడిచి పారిపోయేందుకు కేసీఆర్​ప్లాన్ చేసుకున్నడు..’ అని మంత్రి చెప్పారు.

కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారు..

2015 జూన్​లో జరిగిన కృష్ణా రివర్​మేనేజ్​మెంట్ బోర్డు సమావేశంలో 811 టీఎంసీల కృష్ణా నీటిలో  తెలంగాణకు 299 టీఎంసీలు.. ఏపీకి 512 టీఎంసీల చొప్పున పంచుకునే ఒప్పందంపై కేసీఆర్ సంతకం పెట్టిన సంగతి వాస్తవం కాదా? అని వెంకట్​రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా ప్రాజెక్టు నీళ్ల కోసం వెళ్లిన తెలంగాణ రైతుల్ని ఆంధ్రా పోలీసులు కొడుతుంటే.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి పంపించిన దుర్మార్గుడు కేసీఆర్​ అన్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులన్నీ జగన్ మనుషులకే కట్టబెట్టాడని, ఇద్దరు కలిసి కుమ్మకై.. తెలంగాణను నిండా ముంచారని ఆరోపించారు. ‘తెలంగాణ ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి అప్పగించిండని చెప్పడానికి కేసీఆర్​కు సిగ్గుండాలి.. నీ కమీషన్ల కోసం ఉత్తర తెలంగాణలో కూలిపోయే ప్రాజెక్టులు కట్టినవ్.. ప్రాజెక్టులే కట్టకుండా దక్షిణ తెలంగాణను ఎడారి చేసినవ్.. మీ లిక్కర్ కేసులు మాఫీ చేయించుకునేందుకు నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల ప్రయోజనాలని ఫణంగా పెట్టినవ్.. ఇన్ని చేసి ఇంకా 2 లక్షల మందితో నల్గొండలో సభ పెట్టి కృష్ణా నది నీళ్ల గురించి మాట్లాడతానని స్టేట్​మెంట్ ఇవ్వడం దారుణం’ అంటూ మంత్రి ఫైర్ అయ్యారు.

మాజీ మంత్రి జగదీశ్ జైలుకు పోవుడు ఖాయం..

‘చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి సీఎం రేవంత్​ మీద మాట్లాడుతున్నడు.. నేను పదవి చేపట్టిన రెండు నెలల్లోనే ఎస్ఎల్​బీసీ టన్నెల్ పనులకు రూ.1500 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయించిన.. ఏఎమ్మార్పీ మెయిన్ కెనాల్ పనులకు రూ.525 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయించిన.. డిండి ప్రాజెక్టు కోసం జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను నిరంతరం పని చేస్తున్నం.. కానీ పనికి మాలిన జగదీశ్​కు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ మంత్రి పదవి ఇస్తే అవినీతికి పాల్పడ్డాడు తప్ప ఏనాడు ప్రాజెక్టులను పట్టించుకోలేదు..’ అని ఫైర్ అయ్యారు. ‘ఒకప్పుడు తిండికి లేనోడు యాదాద్రి పవర్‌‌‌‌‌‌‌‌ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో దోచుకొని నాగారంలో రూ.50 కోట్లతో ఇల్లు కట్టుకున్నడు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పక్కన 80 ఎకరాల్లో ఫామ్ హౌస్​ఏర్పాటు చేసుకున్నడు.. ఈ అవినీతిపై సిట్టింగ్‌‌‌‌‌‌‌‌జడ్జితో విచారణ చేయిస్తున్నాం. ఆయన జైలుకు పోక తప్పదు’ అని మంత్రి హెచ్చరించారు.