సోనియాకు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి లేఖ

సోనియాకు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి లేఖ

హైదరాబాద్​, వెలుగు: తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొందరు వ్యవహరిస్తున్నందునే తాను మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉంటున్నానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్​కు సేవ చేస్తున్న తనకు ఈ మధ్య ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని సోనియాకు ఆయన లేఖ రాశారు. సోమవారం ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందునే మునుగోడుపై జరుగుతున్న భేటీకి హాజరు కాలేకపోతున్నానని పేర్కొన్నారు. రేవంత్​ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించానని, కాంగ్రెస్​ అభ్యున్నతికి ఎంతో చేశానని ఆ లేఖలో  వెంకట్​రెడ్డి చెప్పారు.

‘‘కొందరు నేతలు, వారి అనుచరులు నాపై అదేపనిగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నా ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారు. కొన్ని విషయాల్లో నేను క్షమాపణలను ఆహ్వానించినా అవమానాలు మాత్రం ఆగడం లేదు” అని వెంకట్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, శంషాబాద్​లో తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. కొందరు అనుభవంలేని లీడర్ల కారణంగానే పార్టీ భ్రష్టు పడుతోందని విమర్శించారు. మాణిక్కం ఠాగూర్​ వైఖరి వల్లే  తెలంగాణలో కాంగ్రెస్​ తన ఉనికిని కోల్పోతున్నదని వ్యాఖ్యానించారు. ఆయన్ను తొలగించి వేరే వాళ్లను నియమించాలని కోరారు. ‘‘పది పార్టీలు ఫిరాయించిన వారిని పార్టీలోకి తీసుకోవడం వల్ల తీరని అన్యాయం జరుగుతోంది. మునుగోడులో కాంగ్రెస్​కు 30 వేల నుంచి 35 వేల ఓట్లకు మించి రావు. ఢిల్లీలో కోర్​కమిటీ సమీక్షా సమావేశం ఉన్నందునే సోనియాతో భేటీ కాలేకపోయాను. నేను కాంగ్రెస్​ను వీడే ప్రశ్నే లేదు” అని స్పష్టం చేశారు.