
- సమగ్రంగా స్టడీ చేయాల్సిందేనని అప్పట్లో చెప్పిన ఎన్జీఆర్ఐ
- పట్టించుకోకుండా నిర్మాణం మొదలు పెట్టిన గత బీఆర్ఎస్ సర్కారు
- 95 శాతం నిర్మించిన తర్వాత టెక్నికల్ కమిటీ ఏర్పాటు
- కాగ్ డ్రాఫ్ట్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ రిజర్వాయర్ అయిన కొమురవెల్లి మల్లన్నసాగర్ భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉందని, భవిష్యత్‌లో దాంతో భారీ ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదముందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) డ్రాఫ్ట్ రిపోర్టులో హెచ్చరించింది.
50 టీఎంసీల భారీ సామర్థ్యంతో మల్లన్నసాగర్ నిర్మించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. దానికి ముందు భూకంప ప్రభావాన్ని గుర్తించేందుకు కనీసం స్టడీ చేయలేదని తేల్చిచెప్పింది. రూ.6,126 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ రిజర్వాయర్‌లో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేసి వినియోగించడానికి ముందు దాని భద్రతపై లోతైన అధ్యయనం చేయాల్సిందని కాగ్ స్పష్టం చేసింది.
స్టడీ చేయకుండా ఈ రిజర్వాయర్‌ను ఉపయోగించే ప్రయత్నం చేస్తే దానికి దిగునవ ఉన్న ప్రజల ప్రాణాలు, ఆస్తులు ప్రమాదంలో పడిపోతాయని హెచ్చరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి18 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లిస్తామని గత సర్కారు ప్రతిపాదించింది. అందులో10.30 లక్షల ఎకరాలు ఒక్క మల్లన్నసాగర్ కిందనే ఉందని, కాళేశ్వరం మొత్తం ఆయకట్టులో 56 శాతానికి పైగా మల్లన్నసాగర్ కిందనే ప్రతిపాదించిన అప్పటి ప్రభుత్వం దాని భద్రత విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని కాగ్ ఆక్షేపించింది.
భూకంపం వస్తే రిజర్వాయర్ బ్రేక్..
మల్లన్నసాగర్ రిజర్వాయర్ డిజైన్స్, డ్రాయింగ్స్అప్రూవ్ చేయడానికి ముందు హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్ జీఆర్ఐ)తో భూకంప ప్రభావంపై అధ్యయనం చేయించాలని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీర్ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. సీడీవో సీఈ 2016 ఆగస్టులో ఈ సలహా ఇవ్వగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రిలిమినరీ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఎన్జీఆర్ఐని అదే ఏడాది డిసెంబర్లో కోరింది.
ఎన్జీఆర్ఐ తమ ప్రిలిమినరీ రిపోర్టు ఇవ్వడానికి ముందే 2017 డిసెంబర్లో మల్లన్నసాగర్ నిర్మాణ పనులను వర్క్‌ఏజెన్సీలకు అప్పగించింది. కనీసం ఎన్జీఆర్ఐ ప్రిలిమినరీ రిపోర్టు ఇచ్చే వరకు కూడా అప్పటి ప్రభుత్వం ఆగలేదు. 2018 మార్చిలో ఎన్జీఆర్ఐ ప్రభుత్వానికి ప్రిలిమినరీ రిపోర్టు ఇచ్చింది. మల్లన్నసాగర్ నిర్మాణ ప్రాంతంలోని భూగర్భంలో మూడు పొరల లీనమెంట్ ఉందని , రిజర్వాయర్నిర్మించే ప్రదేశంలో భూగర్భంలో నిలువైన పగుళ్లు ఉన్నాయని తేల్చింది. తెలంగాణ సిస్మిక్ జోన్–2 (తక్కువ భూకంప ప్రభావ ప్రాంతం)లో ఉన్నా 1967లో కోయినా, 1993లో లాతూర్‌లో రెండు భూకంపాలు 6.3 తీవ్రతతో సంభవించాయని పేర్కొన్నది.
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు, మహారాష్ట్రలోని లాతూరులో సంభవించిన భూకంపాలతో తెలంగాణ ప్రాంతంలోనూ భూమి కంపించి పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. 1969లో భద్రాచలం రీజియన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చిందని దాని తీవ్రత దక్షిణ ద్వీపకల్పం మొత్తం పడిందని, భూకంప కేంద్రం నుంచి 200 కి.మీ. దూరంలో ఉన్న మల్లన్నసాగర్ ప్రాంతంలోనూ ఆ ప్రభావం కనిపించిందని ఎన్జీఆర్ఐ వెల్లడించింది. 1983లో మేడ్చల్‌లో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని, భూమికి15 కి.మీ లోతులో ఏర్పడిన ఈ భూకంప ప్రభావం కూడా 200 కి.మీ పరిధి ప్రభావం చూపిందని, మేడ్చల్ నుంచి మల్లన్నసాగర్ నిర్మాణ ప్రాంతం కేవలం 20 కి.మీ దూరంలోనే ఉందని పేర్కొంది.
ఈ ప్రాంతంలోని చారిత్రక భూకంప స్థితిని పరిగణనలోకి తీసుకుంటే 5 అంతకన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వస్తే నాన్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ దెబ్బతిన్నాయని తేలిందని, ఈ నేపథ్యంలో రిజర్వాయర్ ప్రాంతంలో భూకంప ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని ఎన్జీఆర్ఐ తేల్చిచెప్పింది. లేదంటే భూకంపం కారణంగా రిజర్వాయర్ బ్రేక్అయ్యే ప్రమాదం ఉందని, అదే జరిగితే దానికి దిగువన భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది.
ఎన్జీఆర్ఐ ప్రిలిమినరీ రిపోర్టు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం డీటైల్డ్ స్టడీ కోసం కనీసం ప్రయత్నించలేదు. అదే సమయంలో వేగంగా మల్లన్నసాగర్ నిర్మించడంపైనే ఫోకస్ చేసింది. 2020 డిసెంబర్ నాటికి రిజర్వాయర్పనులను దాదాపు పూర్తి చేసింది. 2021 సెప్టెంబర్ నాటికి 10.6 టీఎంసీలను ఈ రిజర్వాయర్‌కు పంపింగ్ చేసి 2022 ఫిబ్రవరిలో అప్పటి సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించారు.
రక్షణ చర్యల వివరాలు లేవు..
2018 ఏప్రిల్ నుంచి మే నెలల మధ్య సీఈ, సీడీవో మల్లన్నసాగర్ డ్రాయింగ్స్, డిజైన్స్అప్రూవల్ చేసే సమయంలో భూకంప ప్రభావంపై సమగ్ర స్టడీ చేయించాలని మరోసారి గుర్తు చేశారు. పూణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్), ఐఐటీ రూర్కీలలో ఏదో ఒక సంస్థతో ఈ స్టడీ చేయించాలని సూచించారు. రిజర్వాయర్ నిర్మాణం 95% పూర్తయిన తర్వాత అప్పటి ప్రభుత్వం 2021 జనవరిలో టెక్నికల్కమిటీ ఏర్పాటు చేసి డిజైన్స్, స్టెబిలిటీ అనాలసిస్ తదితర అంశాలపై స్టడీ చేయాలని కోరింది.
అదే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో ఆ కమిటీ మూడు సార్లు మల్లన్నసాగర్‌ను పరిశీలించినా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు. ఈ రిజర్వాయర్‌కు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవడానికి ముందు కూడా ఎలాంటి ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించలేదని కాగ్ చెప్పింది. సీడబ్ల్యూపీఆర్ఎస్తో నివేదిక ఇప్పించినా అది అసమగ్రంగా ఉందని, అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఎలాంటి రక్షణ చర్యలు ఉన్నాయనే వివరాలు అందులో లేవంది.
భూకంప ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయకుండానే రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసి దానికి దిగువున్న ప్రజల జీవితాలను ప్రభుత్వం పణంగా పెట్టిందని హెచ్చరించింది. రిజర్వాయర్ ప్రాంతంలో భూకంప ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేసి, ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించకుండా ఈ రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేయొద్దని కాగ్ స్పష్టం చేసింది.