ఉద్యమాల్లో బాపూజీ పాత్ర మరువలేనిది: ఎంపీ లక్ష్మణ్

ఉద్యమాల్లో బాపూజీ పాత్ర మరువలేనిది: ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు:తెలంగాణ సాధన కోసం తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిదని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ అన్నారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటీషర్లకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలోనూ కొండా లక్ష్మణ్ తనదైన పాత్ర పోషించారని గుర్తుచేశారు.  శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కొండా లక్ష్మణ్ వర్ధంతి కార్యక్రమంలో లక్ష్మణ్  మాట్లాడారు. 

"కొండా లక్ష్మణ్ బాపూజీ విలువలతో కూడిన రాజకీయాలకు పెట్టింది పేరు. మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గొప్ప వ్యక్తి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు సొంత ఇంటిని పార్టీ కార్యాలయంగా ఉపయోగించుకునేందుకు ఇచ్చారు. 

తెలంగాణ కోసం ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో సత్యాగ్రహ దీక్ష చేశారు. సీఎం అయిన తర్వాత బాపూజీని కేసీఆర్ విస్మరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బాపూజీ జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి మాట తప్పింది. కేంద్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్  చేసిన కృషిని గుర్తించి ఆయన పేరు మీద పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసి గౌరవించింది" అని లక్ష్మణ్ పేర్కొన్నారు.