సౌకర్యాలు నిల్ కొండపోచమ్మ ఆలయంలో సమస్యలు

సౌకర్యాలు నిల్ కొండపోచమ్మ ఆలయంలో సమస్యలు
  • భక్తులకు కనీస వసతులు కరవు
  • కాగితాలకే పరిమితమైన రూ.45 కోట్ల ప్రతిపాదనలు
  • ప్రైవేట్ వ్యాపారులదే ఇష్టారాజ్యం

సిద్దిపేట/జగదేవ్ పూర్, వెలుగు: సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ జీపీ పరిధిలో వెలసిన కొండ పోచమ్మ ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కరవయ్యాయి. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ అధికారులు ఈ ఆలయాన్ని పట్టించుకోవడం లేదు. కొమురవెల్లి మల్లన్న దర్శనం అనంతరం భక్తులు ఆనవాయితీ ప్రకారం కొండ పోచమ్మ దర్శనం కోసం వస్తుంటారు. 

సంక్రాంతి నుంచి ఉగాది వరకు కొమురవెల్లితో పాటు కొండ పోచమ్మ జాతర జరుగుతుంది. కానీ భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. వారం చివరలో వేల సంఖ్యలో భక్తులు ఇబ్బందుల మధ్యనే అమ్మవారి దర్శనం చేసుకొని వెనుదిరుగుతున్నారు. 

అటకెక్కిన ఆలయ అభివృద్ధి  ప్రతిపాదనలు

కొండ పోచమ్మ ఆలయ అభివృద్ధికి నాలుగేండ్ల కింద రూ.45 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు రూపొందించినా ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో  ఆలయ నిర్మాణానికి రూ.20 కోట్లు, యాగశాల, కాటేజీలు, మండపాల నిర్మాణానికి మరో రూ.25 కోట్లు ఖర్చువుతుందని అధికారులు  ప్రతిపాదనలు  రూపొందించారు. అప్పటి  మంత్రులు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస యాదవ్ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించినా పనుల్లో మాత్రం ఎలాంటి  పురోగతి లేదు. రెండేళ్ల కింద అప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి ఆలయ సమీపంలోని చెరువును మినీ ట్యాంక్​బండ్​గా మార్చాలని చెప్పినా ఆ దిశగా పనులు మాత్రం జరగలేదు. 

ప్రైవేట్​వ్యాపారుల దోపిడీ

కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి ఏటా  వేల సంఖ్యలో భక్తులు వస్తున్నా వసతి సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు.  ప్రైవేట్ రూములు, తడకలతో ఏర్పాటు చేసిన స్థలాల్లో భక్తులు సేద తీరడానికి, టెంట్లు, తాగునీటికి వేలల్లో వసూలు చేస్తున్నారు. మరోవైపు ఆలయ పరిసరాల్లో పారిశుధ్యం అధ్వాన్నంగా తయారైంది. పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తను తొలగించడం లేదు. ఆలయ సమీపంలోని రోడ్లపై మురికి నీళ్లు నిలిచిపోయి దుర్వాసన వస్తోంది. 

వసతులు లేక ఇబ్బందులు

కొండపోచమ్మ ఆలయానికి  వచ్చే భక్తులకు సరైన వసతి సదుపాయాలు లేవు. అమ్మవారి దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు వస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్ లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. రద్దీ సమయంలో  ప్రైవేట్ వ్యాపారులు భక్తుల నుంచి అధికంగా వసూళ్లు చేయడాన్ని నియంత్రించాలి .- రేణుక, హైదరాబాద్

నిధులు మంజూరైతే మాస్టర్ ప్లాన్

కొండపోచమ్మ ఆలయం అభివృద్ధిపై ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించాం. దీనికి సంబంధించి నిధులు మంజూరైతే పనులు ప్రారంభిస్తాం. ఆలయానికి వచ్చే భక్తులకు మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.రవికుమార్, ఆలయ ఈవో