
ఆధిపత్యానికి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ‘తెలంగాణ సాయుధ పోరాటం’ జరిగిన రోజులవి. నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల దురాగతాలను వ్యతిరేకిస్తూ.. భూమి, భుక్తి, విముక్తి కోసం ఎందరో యోధులు ప్రాణాలను లెక్కచేయక పోరాడారు. ఆ పోరాటంలో కొందరు జైలు పాలయ్యారు. ఆ కోవలోకి చెందినవారే కొండవీటి గురునాథ్ రెడ్డి. ఈయన జీవన పర్యంతం ఎన్నో సాంఘిక, సామాజిక సేవల్లో తరించి, చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇది పుస్తకం కాదు. ఆయన జీవితకథను విశదీకరించే గ్రంథం! అనిపించేలా రాశారు రచయిత.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని.. నిజాం నిరంకుశ పాలన, బానిసత్వం, వెట్టి వ్యవస్థలకు ఎదురొడ్డి తెలంగాణ ప్రజలకు పోరుబాటను చూపారు. గాంధీ, నెహ్రూల జాతీయోద్యమానికి విశేషంగా ప్రభావితులై, అనేకసార్లు జైలు జీవితం గడిపారు.
పుట్టింది నల్గొండ.. నేటి మునుగోడు మండలం పలివెల గ్రామం. ఆ గ్రామ మొదటి సర్పంచ్ కూడా ఆయనే. ప్రజా సమస్యలపై ప్రజా సైనికుడిగా పోరాడారు. కులాలు, మతాలు అంటూ ఏం లేవని అందరూ సమానమేనని అన్నారు. మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావోల ఆలోచనా విధానాలను తెలంగాణ పల్లెవికాసానికి అన్వయించి.. గ్రామాభివృద్ధికి పాటుపడ్డారు.
ఆయనకు తెలుగు భాష మీద మక్కువ ఎక్కువ. సైన్స్, మెకానిక్ సబ్జెక్టులపై ఎనలేని ఆసక్తి. ఎన్నో రంగాల్లో ప్రావీణ్యం ఉంది. స్వీయపరిజ్ఞానంతో రేడియో తయారుచేసి, ప్రజలకు నాటి రెండో ప్రపంచ యుద్ధ వార్తలను వినిపించారు. 1936లో హైదరాబాద్‌లో ఉన్న సుల్తాన్‌బజార్‌లోని శ్రీకష్ణదేవరాయ భాషా నిలయంలో దినపత్రికలు చదవడం వల్ల రాజకీయాలపై మక్కువ ఏర్పడింది.
చిన్నకొండూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి, కొండా లక్ష్మణ్ బాపూజీపై గెలుపొందారు. 1939లో దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా మహాత్మాగాంధీ, నెహ్రూల ఉపన్యాసాలను వినేందుకు హైదరాబాద్ నుంచి బొంబాయికి అక్కడ జరిగిన సభకు18 రోజులపాటు కాలినడకన వెళ్లి వచ్చారంటే అతిశయోక్తి కాదు. 1942లో సుభాష్ చంద్రబోస్ ప్రభావంతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడమే కాక హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్ ప్రభావంతో మూఢనమ్మకాలపై అలుపెరుగని పోరాటం చేశారు. 1944లో తెల్లదొరల చేతిలో చిక్కి చిత్రహింసలు అనుభవించారు. ఈ క్రమంలో జైలు జీవితం గడిపారు.
భూకంపాలు, రేడియో పనితీరు, రేడియోధార్మికత మూఢనమ్మకాలు, రేడియో ఎడిటింగ్ తదితర అంశాలపై పాఠశాలలు, కళాశాలల్లో పాఠాలు బోధించేవారు. తన అనుభవాలను ఎప్పటికప్పుడు గ్రంథస్థం చేసి ఉంచడం వల్ల.. ఆయన కుటుంబంలోని అన్ని తరాలవాళ్ళు కలిసి ఈ పుస్తకాన్ని మనకు అందించడం.. ఇందులో మనకు తెలియని ఎన్నో విషయాలను వారంతా పంచుకోవడం విశేషం! - పి. రాజ్యలక్ష్మీ
- పి. రాజ్యలక్ష్మి